మేమున్నామని.. నీకేం కాదని

8 Nov, 2019 08:46 IST|Sakshi
శాంతికి తాము సేకరించిన మొత్తాని అందజేస్తున్న విద్యార్థినులు, చిత్రంలో మండపేట మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌కుమార్, ఎంఈఓ రామచంద్రరావు తదితరులు 

బాలిక శాంతికి సహచర విద్యార్థుల చేయూత 

వైద్య ఖర్చుల కోసం రూ.1.45 లక్షల విరాళాల సేకరణ

సాక్షి, మండపేట: వారందరూ ఆరు నుంచి 10వ తరగతి లోపు విద్యార్థులు. ఆడుతూ పాడుతూ తిరిగే వయస్సులో తమ స్కూల్‌ విద్యార్థినికి వచ్చిన ఆపదను చూసి చలించిపోయారు. ఆమె వైద్యం కోసం సాయమందించేందుకు నడుం కట్టారు. తమ పాకెట్‌ మనీతో పాటు ఉదయం, సాయంత్ర వేళల్లో సమీపంలోని ఇళ్లకు, దుకాణాల వద్దకు వెళ్లి దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ విధంగా సమకూరిన రూ.1,45,000 మొత్తాన్ని గురువారం చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. చిన్న వయస్సులోనే మానవత్వ పరిమళాలను వెదజల్లారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తమ సహచరి వైద్యం కోసం స్కూల్‌ విద్యార్థులు చేసిన ప్రయత్నం అందరినీ అబ్బురపర్చింది.

కపిలేశ్వరపురం మండలం నేలటూరుకు చెందిన పైడిమళ్ల శాంతి పట్టణంలోని గౌతమి మున్సిపల్‌ హైసూ్కల్‌లో 8వ తరగతి చదువుతోంది. తండ్రి ఇజ్రాయేల్‌ రాజు ఆటో డ్రైవర్‌ కాగా తల్లి ఎస్తేరు రాణి వ్యవసాయ కూలీ. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కాలేయం పూర్తిగా పాడైపోయిన శాంతి మృత్యువుతో పోరాడుతోంది. కాలేయ మార్పిడి చేయకుంటే ఆమె బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు. చెన్నైలో ఆస్పత్రిలో చూపించగా శస్త్ర చికిత్స కోసం రూ. 25 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. బాధితులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, స్టాంప్స్‌ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఆశ్రయించగా ప్రభుత్వం నుంచి కొంతమేర సాయమందించేందుకు ఆయన హామీ ఇచ్చినట్టు తండ్రి ఇజ్రాయేలు రాజు తెలిపారు. వైద్యం కోసం ఇప్పటికే రూ. రెండు లక్షలకు పైగా అప్పుల పాలైన ఆయన కుటుంబం సాయం కోసం ఎదురు చూస్తోంది.

చదువుకునే వయస్సులో శాంతి మృత్యువుతో పోరాడుతుండడం చూసి చలించిన సహచర విద్యార్థులు తమ పాకెట్‌ మనీతో పాటు దాతల సాయాన్ని కోరారు. స్కూల్‌ ప్రారంభానికి, స్కూల్‌ ముగిసిన తర్వాత బృందాలుగా తమతమ ప్రాంతాల్లో పర్యటించి స్థానికులు, వ్యాపారుల నుంచి రూ. 1,45000 విరాళాలు సేకరించారు. ఈ మొత్తాన్ని గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్, ఎంఈఓ ఎన్‌. రామచంద్రరావు, ఉపాధ్యాయుల చేతల మీదుగా శాంతి, ఆమె తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు. హెచ్‌ఎం శోభావళి, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా