ఏపీలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత

29 Sep, 2019 16:25 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత నెలకొంది. సింగరేణి, మహానంది బొగ్గు గనుల నుంచి బొగ్గు సరఫరా తగ్గడంతో ఈ పరిస్థతి తలెత్తింది. భారీ వర్షాలు, కార్మికుల సమ్మెతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్రభావం రాష్ట్రంలో థర్మల్ పవర్‌ ప్లాంట్లపై పడింది. 70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు సరఫరా జరగాల్సి ఉండగా.. ప్రస్తుతం 45 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే రాష్ట్రానికి చేరుతుంది. 

రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణ చర్యలకు ఉపక్రమించారు. సింగరేణి నుంచి వస్తున్న 4 ర్యాకుల బొగ్గును, 9 ర్యాకులకు పెంచాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. బొగ్గు సరఫరా కోసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని.. సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాశారు.

బొగ్గు కొరతతోనే సమస్య
ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ ఉత్పత్తిలో సమస్యల వలన సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయని..విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ట్రాన్స్‌కో  సీఎండీ శ్రీకాంత్‌ తెలిపారు. మంగళవారం నుండి పవర్‌ ఎక్సైంజ్‌ లో అదనంగా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. బొగ్గు సమస్య వల్ల ఇతర రాష్ట్రాలతోపాటు మనకి సమస్య ఏర్పడిందన్నారు.  జెన్ కో ద్వారా 3500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉందన్నారు. కానీ బొగ్గు కొరతతో 1500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందన్నారు. వర్షాలు, ఇతర సమస్యల వల్ల రోజు 75వేల మెట్రిక్ టన్నులకు గాను, 45 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే బొగ్గు వస్తోందన్నారు. మహానది నుంచి రావాల్సిన బొగ్గు ఆగిపోవడం వల్లనే సమస్య ఏర్పడిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారని..సింగరేణి నుంచి రప్పించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

అలాగే థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతపై ఏపీజెన్‌కో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్రానికి బొగ్గు సరఫరా 57 శాతానికి పైగా తగ్గింది. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యం 5010 మెగావాట్లు కాగా, అందుకోసం మహానది కోల్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌) 17.968 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు, సింగరేణి సంస్థ 8.88 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సరఫరా చేయాల్సి ఉంది. అయితే భరత్‌పూర్‌లోని ఎంసీఎల్‌లో జూలై చివరి వారంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో.. కార్మికులు 15 రోజుల పాటు సమ్మె చేశారు. దీంతో ఏపీ థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో భారీగా కొత పడింది. సింగరేణిలో కూడా వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఆగస్టులో డొంకరాయి-సీలేరులో  పవర్‌ కెనాల్‌కు గండి పడింది.. అయితే భారీ వర్షాలతో పునరుద్ధరణ పనులకు ఆటంకం ఏర్పడింది. తద్వారా బొగ్గు కొరత ఎదుర్కొవాల్సి వస్తోంద’ని తెలిపింది. 

అలాగే 2018 నవంబర్‌ నుంచి 2019 ఏప్రిల్‌ వరకు ఏపీ ఇతర రాష్ట్రాల నుంచి కరెంటు అప్పు తీసుకుందని.. 2019 జూన్‌ 15 నుంచి ఆ అప్పు తీరుస్తుందని తెలిపింది. ఇది సెప్టెంబర్‌ 30తో పూర్తి కానుందని పేర్కొంది. పూర్తి స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగిందని చెప్పింది. ఇప్పటికే సింగరేణి నుంచి బొగ్గు సరఫరా పెంచాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారని వెల్లడించింది. అలాగే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ రాశారని.. ఏపీ భవన్‌ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పింది.

మరిన్ని వార్తలు