కడలి అలజడి..!

25 Apr, 2018 01:42 IST|Sakshi
విశాఖ తీరంలో ఎగసిపడుతున్న కెరటాలు

సాక్షి, విశాఖపట్నం: కడలిలో అకస్మాత్తుగా అలజడి రేగింది. ఒకపక్క పెనుగాలులతో కూడిన వర్షం, మరోపక్క ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూసి జనం ఆందోళన చెందారు. మళ్లీ సునామీ వచ్చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇదంతా ప్రచారమేనని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే..?
సోమవారం అర్థరాత్రి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి మొదలైంది. మంగళవారం ఉదయానికి వాటి తీవ్రత మరింత పెరిగింది. హిందూ మహాసముద్రానికి (భూమధ్యరేఖకు) బాగా దిగువన మడగాస్కర్‌ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా అలలు సుమారు 2 మీటర్లకు పైగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో నైరుతి దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి.

అప్రమత్తం చేసిన ఇన్‌కాయిస్‌..
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరంలో లంగరేసిన బోట్లు దెబ్బతినకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలని మత్స్యకారులకు సూచించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది.

సునామీ ప్రచారం నమ్మొద్దు..
ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, అలలు ఎగసి పడడంతో మీడియా, సోషల్‌ మీడియాలో సునామీ రాబోతోందంటూ మంగళవారం విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలోనూ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు మాత్రమే సునామీ వస్తుంది తప్ప కెరటాలు ఎగసిపడినా, అకాల వర్షాలు కురిసినా సునామీ రాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు. 

మరిన్ని వార్తలు