కోరలు చాచిన కోస్టల్ కాలుష్యం

31 Jul, 2014 00:05 IST|Sakshi
కోరలు చాచిన కోస్టల్ కాలుష్యం
  •     రొయ్యల ప్రాసెసింగ్  వ్యర్థాలతో కాలుష్యం
  •      తీవ్ర దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి
  •      జాతీయ రహదారిపై ప్రయాణికుల ఇక్కట్లు
  •      కన్నెత్తి చూడని కాలుష్య నియంత్రణ మండలి
  • దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్యంతో కలవరపడుతున్నారు. అనారోగ్యంతో అస్వస్థులవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదు. రొయ్యల పరిశ్రమ యాజమాన్యం నిబంధనలకు నీళ్లొదిలినా చర్యలు తీసుకోవడం లేదు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద ఏర్పాటైన కోస్టల్ ఫుడ్స్ పరిశ్రమ విడుదల చేస్తున్న దుర్గంధంతో స్థానికులు, జాతీయ రహదారిపై వెళ్లే ప్రయాణికులు విలవిల్లాడుతున్నారు.
     
    యలమంచిలి/ఎస్.రాయవరం: పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల స్థానికుల ఇబ్బందులను యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి కూడా యాజమాన్యాల నిర్వాకంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పరిశ్రమల వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని జనం గగ్గోలు పెడుతున్నా పీసీబీ ఏమాత్రం చలించడం లేదు. ఎస్.రాయవరం మండలం ధర్మవరం వద్ద జాతీయరహదారిని ఆనుకున్న కోస్టల్ ఫుడ్స్ పరిశ్రమ నుంచి వ్యర్థజలాలతోపాటు వెలువడుతున్న తీవ్రమైన దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రెండేళ్లుగా పరిశ్రమలో రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతోంది.
     
    గుట్టుచప్పుడు కాకుండా అనుమతి
     
    విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాలను రొయ్యిలను పరిశ్రమకు తరలించి ఇక్కడే ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలో రోజుకు 50 టన్నుల వరకు రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు అంచనా. ప్రాసెసింగ్‌లో మిగిలిన పొట్టును పలు పరిశ్రమలకు తరలిస్తుండగా వ్యర్థజలాలను మాత్రం స్థానికంగా పొలాల్లోకి విడిచిపెడుతున్నారు.
     
    ఈ పరిశ్రమ ఏర్పాటు కూడా గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు పీసీబీ అనుమతులపై యాజమాన్యం ఇప్పటికీ గుంభనంగానే వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితం పరిశ్రమ నుంచి ఒక్కసారిగా విడుదలైన దుర్గంధం వల్ల 15మంది మహిళలు అస్వస్థులయ్యారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు పరిశ్రమ పరిసరాలను పరిశీలించి దుర్గంధం, వ్యర్థజలాలపై వివరణ కోరారు. పీసీబీ అనుమతులపై కూడా ఆరా తీశారు.
     
    ఆ తర్వాత రెవెన్యూ శాఖ అధికారులు కూడా పరిశ్రమ గురించి పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికార యంత్రాంగాన్ని పరిశ్రమ యాజమాన్యం ప్రలోభాలకు గురిచేయడం వల్లే పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థజలాలు, దుర్గంధం గురించి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధులకు పరిశ్రమ యాజమాన్యం తాయిలాలు ఇస్తోందన్న విమర్శలున్నాయి.
     
    వ్యర్థజలాలు పంటపొలాలకు విడుదల చేస్తుండటంతో రైతుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యాజమాన్యం పంటపొలాలకు వ్యర్థజలాలు వెళ్లకుండా అడ్డుగా గట్టు ఏర్పాటు చేసింది. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న దుర్గంధంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతోపాటు స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్గంధం రాత్రిళ్లు బాగా ఎక్కువగా ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పరిశ్రమ జాతీయరహదారిని ఆనుకుని ఉండటంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
     

మరిన్ని వార్తలు