అభాగ్య రేఖ

8 Jan, 2014 02:02 IST|Sakshi
ఎచ్చెర్ల  క్యాంపస్, న్యూస్‌లైన్: జిల్లా తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉంది. సాధారణంగా విస్తారమైన తీర రేఖ ఉన్న ప్రాంతం పరిశ్రమలు, మత్స్య సంపదతో విలసిల్లుతుంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లాకు ఉన్న అతి పెద్ద తీర రేఖ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆ భాగ్యం కల్పించకపోగా.. చెట్ల నరికివేత, సీఆర్‌జెడ్ నిబంధనలను అమలు చేయకపోవడం వంటి కారణాలతో జిల్లావాసుల పాలిట అభాగ్య రేఖగా మారుతోంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన జియోసైన్స్ విద్యార్థులు, బోధకులు తమ ఫీల్డ్ వర్క్‌లో భాగంగా ఇటీవల తీరప్రాంతంలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే తీరం పొడవునా నివసిస్తున్న వేలాది మత్స్యకార కుటుంబాల జీవన విధానం కూడా నాశనమయ్యే ప్రమాదముందని వీరి అధ్యయనం వెల్లడిస్తోంది. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం, రాళ్లపేట, కొత్తమత్స్యలేశం తదితర గ్రామాల్లో పరిశీలన జరిపిన బీఆర్‌ఏయూ బృందం సముద్ర తీరంలో విలువైన ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు సీఆర్‌జెడ్ పరిధిలో చెట్లు నరికివేతకు గురవుతున్నందున  తీరం భారీగా కోతకు గురవుతున్న విషయాన్ని గమనించారు.
 
 సీఆర్‌జెడ్ అంటే..?!
 సముద్ర తీరాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జెడ్)ను అమల్లోకి తెచ్చి అనేక ఆంక్షలు, పరిమితులు విధించింది. అయితే దురదృష్టవశాత్తు సీఆర్‌జెడ్ అన్నది ఉన్న విషయమే జిల్లావాసులకు తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక దాని అమలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం.. సముద్ర తీరం నుంచి 500 మీటర్ల పరిధిలో చెట్లు పెంచడమే తప్ప.. నరికివేత పూర్తిగా నిషిద్ధం. అలాగే ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే ఆ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. నిర్మాణాలు పెద్దగా లేకపోయినా చెట్ల నరికివేత యథేచ్ఛగా సాగుతోంది. గతంలో తీరప్రాంతాల్లో సరుగుడు తోటలు విస్తారంగా పెంచేవారు. ఇటీవలి కాలంలో సరుగుడుకు డిమాండ్ పెరగడంతో చెట్లను విచక్షణారహితంగా నిరికేసి, అమ్మేసుకుంటున్నారు. 
 
 వాటి స్థానంలో కొత్తగా వనాలు పెంచేందుకు మాత్రం ప్రయత్నించడం లేదు. మరోవైపు చెట్ల నరికివేతతో ఖాళీ అయిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా తీరప్రాంతం ఖాళీ అయిపోతోంది. సముద్రంలో ఆటుపోట్లు పెరిగినప్పుడు ముందుకు చొచ్చుకువచ్చే భీకర అలలను అడ్డుకొనే చెట్లు లేకపోవడంతో అవి విజృంభించి తీరాన్ని కోతకు గురి చేస్తున్నాయి. గతంలో సునామీ వచ్చిన తరువాత ఈ పరిధిలో ఇళ్లు కూడా నిర్మించరాదని ప్రభుత్వం మత్స్య కారులకు సూచించింది. చాలా గ్రామాల్లో సునామీ ఇళ్ల నిర్మాణం జరక్కపోవటంతో మళ్లీ ఈ నిబంధనను మినహాయించారు. సీఆర్‌జెడ్ పరిధిలో సామాజిక వనాల పెంపకం చేపట్టినా.. అవి అక్రమార్కుల బారిన పడుతున్నాయి.
 
 విలువైన సంపదకు నష్టం
 సముద్ర తీరం కోతకు గురైతే దీనిపైనే ఆధారపడిన మత్స్యకార గ్రామాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. వేట కష్టమవుతుంది. తుఫాన్లు, సునామీలు సంభవించే సమయంలో సముద్రం తీర గ్రామాలను ముంచేసే ప్రమాదముంది. దీనికితోడు తీరంలో నిక్షిప్తమై ఉన్న  విలువైన ఖనిజ సంపదను కూడా కోల్పోవలసి వస్తుంది. సముద్రపు ఇసుక తిన్నెల్లో గార్నైట్, ఇలిమ్‌నైట్, ప్రొలైట్, తదితర విలువైన ఖనిజాలు ఉంటాయి. కోత కారణంగా ఇవన్నీ సముద్రంలో కలిసిపోతాయి.  
 
 చెట్ల పెంపకం తప్పని సరి
 కోత నుంచి తీరాన్ని రక్షించాలంటే చె ట్ల పెంపకం తప్పనిసరి. ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం, రాళ్లపేట, కొత్తమత్స్యలేశం తదితర ప్రాంతాలను పరిశీలించాం. వర్సిటీలో 20 ఆర్థిక సూత్రాల ప్రణాళికలో భాగంగా 26 మంది విద్యార్థులతో కలిసి తీరంలో అధ్యయనం చేశాం. సీఆర్‌జెడ్ పరిధిలోని చెట్లు నరికేస్తున్నారు. దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
 -డాక్టర్ గొర్లె సూర్యనారాయణ, 
 జీయోసైన్సు కోర్సు కోఆర్డినేటర్, బీఆర్‌ఏయూ
 
 పరిశీలిస్తాం
 మొత్తం తీర ప్రాంతం పరిశీలించాల్సి ఉంది. సీఆర్‌జెడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. నిబంధనలకు వ్యతి రేకంగా చెట్లు నరికే వారిపై చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో ముందుగా గుర్తించాల్సి ఉంది.
 -పి.కోటేశ్వరరావు, 
 జేడీ, జిల్లా మత్స్యశాఖ 
 

 

మరిన్ని వార్తలు