వేటాడే నాగు

24 Sep, 2017 04:21 IST|Sakshi

ఒకే వ్యక్తిపై 34 సార్లు కాటేసిన నాగుపాములు

ప్రాణాపాయం ఎక్కడికీ వెళ్లలేని దుస్థితి

ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడ్డ రైతు

బి.కొత్తకోట(చిత్తూరు జిల్లా): నాగుపాములు పగపట్టి కాటేస్తాయని సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో నాగుపాములు ఓవ్యక్తిని ఏకంగా 34 సార్లు వేటాడి మరీ కాటేశాయి. ప్రతిసారి ప్రాణాపాయం తప్పడం అదృష్టమే అయినా వైద్యం కోసం లక్షలు ఖర్చుచేసి ఆర్థికంగా చితికిపోయాడు ఆరైతు.

వివరాల్లోకి వెళ్తే తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ ఉప్పలూరివాండ్లపల్లెకు చెందిన కె.సురేంద్రనాథ్‌ రెడ్డిపై పాములు పగపట్టాయి. ఎప్పుడు ఏ పామొచ్చి కాటేస్తుందో తెలియదు. ఒంటరిగా క్షణమున్న భయం. రోడ్డుమీదకొస్తే జనం మధ్యే ఉండాలి. లేదంటే ఎటువచ్చి పాము కాటేస్తుందో అన్న ఆందోళన. ఇలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్న సురేంద్రనాథ్‌రెడ్డికి వేటాడుతున్న పాములు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా ఒకేవ్యక్తిని నాగుపాములు పదేపదే కాటేయం పెద్ద చర్చగా మారింది.
 
పొలం దున్నుతుండగా తొలిసారి...
2002 జూన్‌లో సురేంద్రనాద్‌రెడ్డి ఊరికి సమీపంలో పొలం దున్నతున్నండగా భూమిని చీల్చుకొంటూ వెళ్తున్న మడకలోంచి బయటకొచ్చిన నాగుపాము సురేంద్ర కాలికి కాటేసింది. దీనికి వైద్యం తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. అప్పటినుంచి మొదలైన నాగుపాముల వేట నిరంతరం కొనసాగింది. ఇంటిలో ఉంటే తప్ప ఎక్కడ కనిపించినా పాము కాటేసేది. 2017 మే 29 వరకు మొత్తం 34 సార్లు నాగుపాములు కాటేశాయి. కాళ్లు చేతులపై వేసిన కాట్లతో చెరిగిపోని గుర్తులుగా మిగిలాయి. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, జనం మధ్యలో ఉన్నా కాటేసి వెళ్లేవి. స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించి ప్రాణం నిలపెట్టేవాళ్లు. ఇలా నాగుపాములు కాటేస్తున్న విషయంపై వైద్యులకు అనుమానం వస్తే ఓసారి ఎడమచేతికి కాటేసిన నాగుపామును అలాగే తీసుకుని ఆస్పత్రికి వచ్చాడు సురేంద్ర. దీనితో నిజమేనని నమ్మిన వైద్యులు చికిత్సలు చేస్తూ బతికిస్తూ వస్తున్నారు. కాటేసిన ప్రతిసారి ప్రాణం పోయిందన్న ఆవేదనతో సురేంద్రనాధ్‌రెడ్డి కుమిలిపోయేవాడు. కాటేసిన పాముల్లో ఆరింటిని చంపేశాడు. కొన్ని సార్లు చావు అంచులదాక వెళ్లొచ్చాడు. ఈ సందర్భాల్లో నోరు, ముక్కుల్లోంచి రక్తం, నురగ రావడంతో తిరుపతి, బెంగళూరు ఆస్పత్రుల్లో వైద్యం పొందాడు.

ఇల్లు గుల్ల
పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు వైద్యం కోసం సురేంద్రనాథ్‌రెడ్డి సుమారు రూ.10లక్షల వరకు ఖర్చు చేశాడు. దీనికి సంబంధించి రూ.6.50లక్షల వైద్యం బిల్లులు ఉన్నాయి. కుటుంబం గడవడమే భారంగా మారిన సురేంద్రనాథరెడ్డికి భార్య రెడ్డెమ్మ, చదువుకొనే ఇద్దరు కుమార్తెలు చదువుతున్నారు. సురేంద్రకు ఏలాంటి ఆదాయమార్గాలు లేవు. వ్యవసాయం ఆగిపోయింది. భార్య రెడ్డెమ్మ స్వచ్చంద సంస్థలో పనిచేస్తుండగా వచ్చే కొద్దిపాటి వేతనంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పుడు సురేంద్ర పరిస్థితి దయనీయంగా మారింది. వైద్యం, పాముకాట్ల కారణంగా శరీరం నిస్సత్తువుగా మారింది. ఎక్కువ దూరం నడవలేడు. మునుపటిలా కష్టపడి సేద్యం చేయలేడు. వర్షంలో తడిస్తే వాపులు, గుల్లలు వస్తాయి. దీనికి విరుగుడుగా వేడి పదార్థాలను తీసుకుంటే తగ్గిపోతాయి. దీనిపై సురేంద్ర, ఆయన భార్య రెడ్డమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత మందిలో ఉన్నా తననే పాములు ఎందుకు కాటేస్తున్నాయో అర్థం కావడం లేదని సురేంద్ర వాపోయాడు.

మరిన్ని వార్తలు