ముందే సంకురాత్రి!

2 Jan, 2019 09:04 IST|Sakshi

సాక్షి  ప్రతినిధి ఏలూరు: జిల్లాలో ముందే కోడి కూసింది. 13రోజుల ముందే సంక్రాంతి వచ్చేసింది. కోడి పందేలకు తెరలేచింది.  సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి మూడు రోజులపాటు జిల్లాలో పెద్ద ఎత్తున పందేలు  నిర్వహిస్తుంటారు.  సంక్రాంతి పండుగకు ఇంకా 13 రోజులు ఉండగానే జిల్లాలో పందేలు జోరందుకున్నాయి. ఇవి రాత్రుళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీటికి పోలీసు అధికారులు  తెరవెనుక సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.     

రాత్రుళ్లు.. ఊరికి దూరంగా..
ప్రస్తుతం కోడిపందేల నిర్వహణ రాత్రి సమయాల్లోనే నిర్వహిస్తున్నారు. ఊరికి చివర ఉండి పోలీసులు రావడానికి సమయం పట్టే ప్రాంతాలను కోడి పందేల కోసం ఎంచుకుంటున్నారు. తాజాగా  లింగపాలెం మండలం కలరాయనిగూడెం ప్రగతిపురంలో ఓ ఆయిల్‌పామ్‌ తోటలో అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి  భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఏటా ఆ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహించే ఓ నేత ముందుగానే పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుని పందేలకు తెరలేపినట్లు సమాచారం. స్థానిక ఎస్సై విజయవాడ బందోబస్తులో ఉండటంతోపాటు  పోలీసులు నూతన సంవత్సర వేడుకల హడావుడిలో ఉండటంతో జూదరులు యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. 

చేతులు మారిన రూ.లక్షలు
సోమవారం రాత్రి  ప్రగతిపురంలోని  ఓ ఆయిల్‌పామ్‌ తోటలో నిర్వహించిన కోడి పందేల్లో లక్షలాది రూపాయిలు చేతులు  మారి నట్లు సమాచారం. జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి  పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు ఈ కోడి పందేలకు హాజరయ్యారు. పందేలు జరిగే ప్రాంతానికి సుమారు 150 వరకూ కార్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. ముందస్తుగానే ప్రణాళిక ప్రకారమే ఈ పందేలు నిర్వహించారని, అందుకే పెద్ద సంఖ్యలో జూదరులు వచ్చారని సమాచారం. సోమవారం రాత్రి  మొత్తం ఐదు పందేలు నిర్వహించగా వాటి  ద్వారా  సుమారు రూ. 40 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.  ప్రగతిపురంలో కోడి పందేలు నిర్వహిస్తున్న సమాచారం  జిల్లా  పోలీసు బాస్‌కు అందడంతో ఆయన ఆదేశాలతో టి.నరసాపురం ఎస్సై ఆధ్వర్యంలో  దాడులు నిర్వహించారు.

 సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి సదరు పోలీసులు పందేలు జరుగుతున్న ప్రదేశానికి వచ్చే సరికి జూదరులు ఆ ప్రదేశం నుంచి జారుకున్నారు.  కొద్దిసేపట్లో దాడులు జరుగుతాయని అధికార పార్టీకి చెందిన సదరు నిర్వాహకుడికి ఓ పోలీసు అధికారే సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లేలోగానే జూదరులు జారుకున్నారు. కోడి పందేలకు స్థానిక పోలీసు అధికారులే  సహకారం అందించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా పోలీసు బాస్‌ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి!

మరిన్ని వార్తలు