పశ్చిమ బరిలో రూ. 200 కోట్లు!

26 Dec, 2017 10:23 IST|Sakshi

కోడి పుంజులకు కత్తులు కట్టొదన్న సుప్రీం ఆదేశాలు బేఖాతర్‌

ఇప్పటికే జూదం, మద్యం అమ్మకాల కోసం వేలం పాటలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కోడి పుంజులకు కత్తులు కట్టి పందేలు నిర్వహించరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా తెర వెనుక ఏర్పాట్లు మాత్రం యథావిధిగానే సాగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది కూడా 50కి పైగా బరులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భోగి నాటి నుంచి ప్రారంభం అయ్యే  పందేలు, జూదాల్లో  జిల్లావ్యాప్తంగా సుమారు రూ.రెండు వందల కోట్లు చేతులు మారతాయని అంచనా.

జాతరే జాతర..
కోడి పందేల బరుల వద్దే పేకాట శిబిరాలు, మద్యం దుకాణాలు, బెల్టు షాపులు వెలిసి జాతరలను తలపిస్తాయి. వీటిని నిర్వహించుకునేందుకు ఇప్పటికే వేలం పాటలు మొదలయ్యాయి. పందేల మాటున పేకాట, గుండాట, కోతాట, జూదం నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడి పందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం జరగకుండా చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కలిదిండి రామచంద్రరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణను హైకోర్టు జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

దగ్గరుండి ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతలు
రాష్ట్రంలో 2014 తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయం పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులే ముందుండి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, గుండుగొలను, జంగారెడ్డిగూడెం, కొప్పాక తదితర చోట్ల పెద్ద ఎత్తున కోడిపందేలు జరుగుతున్నాయి. భోగి పండుగ నుంచి కనుమ వరకూ రాత్రి పగలు తేడా లేకుండా ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. పండగ మూడు రోజులు కోళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించారు. కేసులు నమోదు చేస్తామని పోలీసుల హెచ్చరిక గత ఏడాది జాయింట్‌ యాక్షన్‌ టీములను ఏర్పాటు చేసి కోడి పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించినా ఎక్కడా అమలు కాలేదు.

ఈసారి కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితోపాటు పందేలను ప్రోత్సహించే వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోడిపందేలపై ఇటీవల జరిగిన సమీక్షలో ఎస్పీ రవిప్రకాష్‌ అ«ధికారులకు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. కోడిపందేలు ఎక్కడ జరిగినా అక్కడి స్టేషన్‌ ఆఫీసర్‌ను బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు