ఇకనైనా జూలు విదులుస్తారా!

7 Jan, 2016 00:30 IST|Sakshi

 హైకోర్టు ఆదేశాలనైనా అమలు చేస్తారా?
 బరి తెగించిన టీడీపీ నేతలకు అడ్డుకట్ట వేస్తారా !
 లేదంటే ప్రకటనలకే పరిమితం అవుతారా?
 ఖాకీల ముందున్న కోడిపందేల సవాల్
 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :‘‘కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతాం.. ఎవరైనా ఆడినా, ఆడించినా రౌడీషీట్ తెరుస్తాం... ఎంతటి వారైనా వదిలేదు లేదు.. కఠినంగా శిక్షిస్తాం.. ’’ ప్రతి రోజూ పత్రికల్లో ఆర్భాటంగా కనిపిస్తున్న పోలీసు అధికారుల ప్రకటనలివి. కానీ కార్యాచరణలో మాత్రం ఎక్కడా ఆ ప్రతాపం కనిపించడం లేదు. జిల్లావ్యాప్తంగా కోడిపందేలు ఆడించే చరిత్ర ఎవరెవరికి ఉంది..ఎక్కడెక్కడ ఎవరెవరు ఆడిస్తారు.. అనే వాస్తవాలు జిల్లా పోలీసు అధికారులు తెలుసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. అటువంటి ఆటగాళ్ల చిట్టా తీసి బైండోవర్ చేయించాల్సిన అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 ఎక్కడో ఎందుకు.. జిల్లా కేంద్రం ఏలూరు సమీపంలో నిత్యం పగలు, రాత్రి తేడా లేకుండా కోడిపందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులను సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద  బైండోవర్ చేయించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు మార్గదర్శకాలు పంపి చాలాకాలమైంది. కానీ నేటికీ ఆ ఇద్దరు నేతల జోలికి వెళ్లే సాహసం పోలీసు సిబ్బంది చేయడం లేదు. దాంతో ఇదే అదనుగా ఆ నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా తమ ఇలాకాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పెద్ద పందేలు ఇంకా ఎక్కడా మొదలు కాకున్నా ఇక్కడ మాత్రం ఓ మోస్తరు పందేలు నిత్యం అడ్డూ అదుపు లేకుండా సాగిపోతున్నాయి.
 
 సర్కారు హామీని తెలుగు తమ్ముళ్లు నిలబెడతారా?
 సంక్రాంతి పండగ సందర్భంగా కోడిపందేలను అనుమతించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. పందేలు, జూదాలు తదితర అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా గతేడాది జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని, ఈ ఏడాది కూడా పోలీసులు వాటిని అమలు చేస్తారని సర్కారు స్పష్టం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి కోడిపందేలు నిర్వహిస్తారని, ఈ ఏడాది కూడా పందేల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏలూరుకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు వివరణనిచ్చిన సర్కారు కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం న్యాయస్థానంలో ఇచ్చిన హామీ  క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో బడా పందేల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ నేతలే ఉన్నారనేది బహిరంగ రహస్యం. ప్రభుత్వం హైకోర్టులో ఇచ్చిన హామీ మేరకైనా ఈ ఏడాది టీడీపీ నేతలు కోడిపందేల విషయంలో వెనక్కి తగ్గుతారా.. లేదా గతేడాది మాదిరి కోర్టు ఆంక్షలను ధిక్కరించి జోరుగా పందేలు వేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
 గతేడాది చివర్లో మారిన సీన్
 గతేడాది కూడా కేవలం హైకోర్టు ఆదేశాలను అమలు చేసి కోడిపందేలపై కొరడా ఝుళిపించిన అప్పటి ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిపై అప్పట్లో టీడీపీ నేతలు కక్ష గట్టారు. కోడిపందేలపై ఆంక్షల నేపథ్యంలోనే ఆయన్ను బదిలీ చేయించాల్సిందిగా పట్టుబట్టారు. తాను హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నానని చెప్పినా నానాయాగీ చేశారు. అయినా రఘురామిరెడ్డి ఖాతరు చేయలేదు. అయితే, జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు తలొగ్గిన పాలకులు సంక్రాంతి పండగ మూడురోజుల పాటు మాత్రం పందేలపై ఆంక్షలు ఎత్తివేశారు. దాంతో పండగ వేళ పందేల మాటున వందల రూ.కోట్లు చేతులు మారాయి. కానీ ఈసారి కాస్త ముందుగానే పందేల నిర్వహణలో టీడీపీ నేతలు తలమునకలయ్యారు. ప్రస్తుత ఎస్పీ భాస్కర్ భూషణ్ కూడా కోడిపందేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నారు. పందేలు జరిగితే చూస్తూ ఊరుకోనని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నా ఆయనకు క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది ఏ మేరకు సహకరిస్తారు.. ఆయన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తారా.. పార్టీలకతీతంగా వ్యవహరించి ‘పచ్చ’ పందేల నిర్వాహకులను పరుగులెత్తించగలరా.. అనేది ఈ వారంలోనే తేలిపోనుంది.
 
 ఈసారి పందేలు జరిగితే కోర్టు ధిక్కార పిటిషన్లు వేస్తాం
 సాక్షి ప్రతినిధి, ఏలూరు : హైకోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చట్టవ్యతిరేకంగా కోడిపందేలు వేస్తే ఈసారి కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేస్తామని ఏలూరుకు చెందిన నరహరి జగదీష్‌కుమార్, న్యాయవాది పీడీఆర్ రాయల్ తెలిపారు. జగదీష్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ నేపథ్యంలోనే ప్రభుత్వం కోడిపందేలపై ఉక్కుపాదం మోపుతామని హైకోర్టుకు నివేదించింది. ఈ సందర్భంగా బుధవారం జగదీష్, న్యాయవాది రాయల్ ఏలూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. కత్తులు లేకుండా కోడిపందేలు ఆడుకునేందుకు తాము వ్యతిరేకంగా కాదన్నారు. అయితే కోడిపందేల మాటున కొన్నేళ్లుగా జిల్లాలో సంఘ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ సారి..  హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కోడిపందేలు ఆడిన వారికి, ప్రోత్సహించిన నేతలకు లీగల్ నోటీసులు పంపిస్తామని  చెప్పారు. అదేవిధంగా కోర్టు ధిక్కార పిటిషన్లను కూడా దాఖలు చేస్తామని తెలిపారు. కోడిపందేలను అరికట్టేందుకు చట్టప్రకారం పని చేస్తున్న జిల్లా పోలీసులకు అందరూ సహకరించాలని వారు కోరారు.
 

మరిన్ని వార్తలు