అధికారుల మధ్య కోల్డ్‌వార్‌

5 May, 2018 12:13 IST|Sakshi
అస్వస్థతకు గురైన తహసీల్దార్‌ చెంచుకృష్ణమ్మ(ఫైల్‌)

జిల్లా ఉన్నతాధికారుల  తీరుతో నలిగిపోతున్న వైనం

తహసీల్దార్లపై చిందులు

హడలిపోతున్న అధికారులు

నెల్లూరు(పొగతోట): ఓ పక్క పని ఒత్తిడి.. మరోవైపు జిల్లా ఉన్నతాధికారుల హెచ్చరికలతో రెవెన్యూ శాఖ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు సైతం జిల్లా స్థాయి అధికారులకు ఎదురు తిరగలేక.. చెప్పిన పని చేయలేక నలిగిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారుల మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. ఉన్నతాధికారుల వైఖరిపై రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేం దుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

పని ఒత్తిడి తట్టుకోలేక..
పని ఒత్తిడి తట్టుకోలేక ఓ అధికారి మరణించగా, మరో అ«ధికారి ఆస్పత్రి పాలయ్యారు. జిల్లా అ«ధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేక సివిల్‌ సప్లయ్స్‌ డీఎం తన కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇదీ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితి. పనులు చేస్తున్నా, అది చాలదని, ఇంకా పరిగెత్తండంటూ ఒత్తిళ్లు చేయడంతో రెవెన్యూ అధికారులు ఆస్పత్రుల పాలవుతున్నారు. సమావేశాల్లో తహసీల్దార్లు, సీఎస్డీటీలను మందలించిన విషయం పత్రిక విలేకరికి ఎవరు చేరవేస్తున్నారంటూ జిల్లా అధికారులు ఆరాతీస్తున్నారు. మీరెన్ని చేసినా మా తీరింతేనని బెదిరిస్తున్నారని సమాచారం. సమీక్ష సమావేశాల్లో తహసీల్దార్లు, డీటీలు, సీఎస్డీటీలతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం రివాజు గా మారిపోయింది. ధర్నాలు, ఆందోళనలు చేసుకోండి ఐ డోంట్‌కేర్‌ అనే రీతి లో వ్యవహరిస్తున్నారని సమాచారం.

సెలవుపై తహసీల్దార్‌
తహసీల్దార్లతో చులకనగా మట్లాడటంతో ఒకరు సెలవుపై వెళ్లగా, మరో ఇద్దరు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారుల ఒత్తిళ్లను తట్టుకోలేక అనంతసాగరం తహసీల్దార్‌ చెంచుకృష్ణమ్మ ఆస్పత్రి పాలై మరణించారు. అధికారుల ఒత్తిళ్లు, బెదిరింపులను తట్టుకోలేక జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం తన కార్యాలయంలోనే ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో సిబ్బంది కాపాడటంతో డీఎం ప్రాణాలతో బయటపడ్డారు. రికార్డులు సక్రమంగా లేకపోతే వాటిని ఈ విధంగా రాయాలని సూచించకుండా అందరి ముందు అవమానకరంగా మాట్లాడి మానసికంగా హింసిస్తున్నారని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు.

సీనియర్‌ తహసీల్దార్లతో దురుసు
సీనియర్‌ తహసీల్దార్లతో జిల్లా అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాను జిల్లాకు వచ్చింది మీరు చెప్పింది వినడానికి కాదు.. తాను చెప్పింది చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నారు.  మీరు చెప్పింది ఆచరణలో సాధ్యంకాదు అని సమాధానం చెప్పిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సాధారణ పాలన, జిల్లా అధికారుల సొంత అజెండా, సర్వేలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, సమీక్ష, సమావేశాలు, తదితరాలతో రెవెన్యూ అధికారులు అల్లాడిపోతున్నారు. సిబ్బంది తక్కువ సమస్యలు అధికం. సూచించిన పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. సీనియర్లని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. ఇది మంచిపద్ధతి కాదని.. జిల్లా అధికారులు, రెవెన్యూ ఉద్యోగుల మధ్య అగాధం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే జరగబోయే పరిణామాలకు జిల్లా యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బొప్పరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు