రగిలిపోతున్న తమ్ముళ్లు

2 Mar, 2014 04:57 IST|Sakshi

 నెల్లూరు: జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి పతాకస్థాయికి చేరింది. ఆది నుంచి పార్టీ జెండాలు మోసి, రోగాల బారిన పడి, అధిష్టానం అనుగ్రహం కరువవడంతో తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహ సెగలు ఎగసిపడుతున్నాయి.

అసలే అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారి అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న సమయంలో కాంగ్రెస్ నేతల వలసలు టీడీపీలో అగ్నికి ఆజ్యం పోసినట్లవుతున్నాయి. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నడుస్తున్న వారిని పక్కనపెట్టి ఆర్థిక బలం, అధికార దాహంతో అప్పటికప్పుడు పార్టీలోకి వస్తున్న కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇస్తుండటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వైఖరి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలనిస్తుందని, పార్టీ కోసం పనిచేసే వారు కరువయ్యే పరిస్థితి నెలకొంటుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను తెచ్చుకుని, టికెట్లు ఇచ్చినా ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని గుర్తుచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
 

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ కోసం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి  కష్టనష్టాలకోర్చి పనిచేసి, చివరకు అనారోగ్యం కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనను కాదని ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డిని అభ్యర్థిగా నిలపాలని చంద్రబాబు నిర్ణయించడంతో కార్యకర్తల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, అంచెల వాణి కూడా టికెట్ ఆశిస్తున్నారు.
 

కోవూరులో పార్టీకి ఏ దిక్కూ లేనప్పుడు అండగా నిలిచి పంచాయతీ ఎన్నికల్లో ఆర్థికంగా అదుకున్న పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి మొన్నటి వరకు అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మొండి చూపి చూపి దాదాపుగా కాంగ్రెస్ నేత పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఖరారు చేశారు.  
 

వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు చదల వాడ సుచరిత టికెట్‌ను ఆశిస్తున్నారు. దీంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. సూళ్లూరుపేటలోనూ ఎమ్మెల్యే పర సా రత్నంను ఆ పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
 

సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోటీ చేస్తారని, ఒకవేళ పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి సర్వేపల్లి కేటాయిస్తే సోమిరెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే సర్వేపల్లిలో టీడీపీతో కాంగ్రెస్ శ్రేణులన్నీ దాదాపు వైఎస్సార్‌సీపీలో చేరిపోయాయి. ఆదాల రాకను వ్యతి రేకిస్తున్న మిగిలిన టీడీపీ శ్రేణులు కూడా వైఎస్సార్‌సీపీ బాట పడుతున్నాయి.
 

ఉదయగిరిలో బొల్లినేని రామారావు పోటీకి దూరంగా ఉంటారనే ప్రచారం, మరోవైపు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి బరిలో దిగుతారని ఆయన వర్గీయులు చెబుతుండటంతో కార్యకర్తలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు నియోజకవర్గాల్లో మినహా దాదాపు అన్ని చోట్ల కొత్త అభ్యర్థులు రంగంలో దిగే పరిస్థితులు ఉండటం, ఇప్పటికప్పుడు పార్టీలోకి వస్తుండటంతో శ్రేణులు డీలా పడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు