ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి

19 Nov, 2017 06:39 IST|Sakshi

కోవెలకుంట్ల: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలని రాయలసీమ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ కామని వేణుగోపాల్‌రెడ్డి వైఎస్‌ జగన్‌ను కోరారు. శనివారం భీమునిపాడు సమీపంలో జరిగిన పాదయాత్రలో వైఎస్‌జగన్‌ను కలిసి వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. 2008 డిసెంబర్‌లో వైఎస్‌ఆర్‌ కోవెలకుంట్ల మండలం జోళదరాశి వద్ద 0.8 టీఎంసీ, చాగలమర్రి మండలం రాజోలి వద్ద 2.80 టీఎంసీల సామర్థ్యంతో కుందూనదిపై రిజర్వాయర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. కానీ ఇప్పటి వరకు రిజర్వాయర్ల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వేణుగోపాల్‌రెడ్డి జగన్‌ దృష్టికి తెచ్చారు. 

అలాగే అవుకు రిజర్వాయర్‌ రెండో దశ పనుల్లో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచగా ఇప్పటివరకు రిజర్వాయర్‌లో ఆ స్థాయిలో పెట్టలేదన్నారు. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలో నిర్మిస్తున్న రెండు సొరంగ మార్గాల్లో 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించేలా చర్యలు తీసుకోవాలని, గోరుకల్లు రిజర్వాయర్‌ సీపేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన జగన్‌ను కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూనదిపై రిజర్వాయర్ల నిర్మాణానికి కృషి చేస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కాటసాని రామిరెడ్డి, రైతు విభాగ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, శివరామిరెడ్డి, రైతు విభాగ సంఘం నాయకులు శరత్‌చంద్రారెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, నరేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

నీటికష్టాలు తీర్చండి..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించి జిల్లాతో పాటు రాయలసీమకు సాగు, తా గునీటి కష్టాలు తీర్చాలని ఏపీ రైతు సంఘం ఆళ్లగడ్డ కార్యదర్శి అనుమంతరెడ్డి, జ్యోతిర్మయి జగన్‌ను కలిసి విన్నవించారు. అలాగే పెండింగ్‌లోని హంద్రీనీవా, గాలేరు–నగరి, వేదావతి, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, వెలుగోడు ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు