మా మొర ఆలకించండి సారూ...!

14 Jul, 2015 03:58 IST|Sakshi
మా మొర ఆలకించండి సారూ...!

చిత్తూరు (అగ్రికల్చర్): మామొర ఆలకించడండి సారూ..అంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి (గ్రీవెన్స్)లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు విన్నవించారు. ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) నారాయణభరత్‌గుప్తా, జిల్లా సంయుక్త కలెక్టర్ (ఏజీసీ) వెంకటసుబ్బారెడ్డి పాల్గొని, ప్రజల వ ద్ద నుంచి అర్జీలను స్వీకరించారు.  
 
బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో భవన వసతి కల్పించండి
మహాత్మా జ్యోతిరావ్‌పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో భవన వసతి కల్పించాలని ఆ పాఠశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో జేసీ భరత్‌గుప్తాకు విన్నవించారు. జిల్లాలోని పీలేరు, కలికిరి, ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణి క్యంలో ఉన్న బీసీ రెనిడెన్సియల్ పాఠశాలలో ఈ ఏడాదికి దాదాపు 240 మంది విద్యార్థులు ఐదో తరగతిలో ప్రవేశం పొందారన్నారు.  ప్రవేశాలు జరిగి రెండువారాలైనా భవన వసతిలేక ఇంతవరకు పాఠశాల్లో తరగతులు ప్రారంభించ లేదన్నారు. వెంటనే భవన వసతి కల్పించి, తరగతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
 
చెరువులో ఆక్రమణలు తొలగించండి
తమ గ్రామానికి చెరువులోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఐరాల మండలం అబ్బుగుండు దళితవాడ వాసులు జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. కొంత కాలంగా తమ గ్రామ చెరువును కొందరు స్వార్థపరులు ఆక్రమించుకుని వ్యవసాయ పొలాలుగా మార్చుకున్నారని తెలిపారు. ఆక్రమణల కారణంగా చెరువు రూపురేఖలు కోల్పోయిందన్నారు. ఫలితంగా వర్షం వస్తే ఈ చెరువులో నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదన్నారు. దీంతో చెరువు ఆయకట్టుకు భవిష్యత్‌లో నీరందే పరిస్థితి లేదని చెఆప్పరు. ఆక్రమణలను తొలగించి చెరువును కాపాడాలని వారు కోరారు.
 
ఎస్సీలకు చేయూతనివ్వండి
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.విజయభాస్కర్, యం.సుధాకర్‌లు ప్రజావాణిలో జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇండస్ట్రీయల్ పాలసీ కింద వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించడం లేదన్నారు. కావున ఎస్సీ, ఎస్టీలకు గతంలో మాదిరి వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు బ్యాంక్ గ్యారంటీ పథకం కింద రూ. 25 లక్షల వరకు బ్యాంకులు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పరంగా అందించిన ఇళ్లపట్టాలు, వ్యవసాయ బంజరు భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.
 
ఉద్యోగం ఇప్పించండి సారూ  

తాను నిరుపేద వికలాంగుడినని, ఎంకామ్ వరకు చదువుకున్నానని.. తనకు ఉద్యోగం ఇప్పించాలని బంగారుపాళెం మండలం శేషాపురం గ్రామానికి చెందిన కృష్ణమనాయుడు సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జేసీ నారాయణ భరత్‌గుప్తాకు విజ్ఞప్తి చేశారు. తనకు 90 శాతం వికలత్వం ఉన్నట్లు సదరన్ ద్వారా గుర్తింపు కూడా ఉన్నట్లు తెలియజేశారు. తాను గతంలో పలు సార్లు ప్రభుత్వం వెలువరించిన నోటిఫికేషన్‌ల ప్రకారం ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నామని తెలిపారు. అయితే ఉద్యోగాల కేటాయింపులో తనకు అధికారులు అన్యాయం చేస్తున్నారని ఆయన వాపోయారు. తనది నిరుపేద కుటుంబమని, తమ తల్లిదండ్రులు రోజువారి కూలీపనులకు వెళ్లి, జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కావున తనకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని వినతి చేశాడు.

మరిన్ని వార్తలు