కలెక్టరేట్‌లో నరేంద్ర మోదీ

15 Oct, 2014 01:56 IST|Sakshi
  • సందర్శించిన తొలి ప్రధాని
  •  నేతలు, అధికారులతో సమీక్ష
  • విశాఖ రూరల్ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విశాఖ కలెక్టరేట్ భవనాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఈ భవనాన్ని సందర్శించిన తొలి ప్రధాని ఆయన కావడం విశేషం. ఆయన కలెక్టరేట్‌లో 30 నిమిషాలు గడిపారు. 1914లో నిర్మించిన ఈ భవనాన్ని తొలుత ఆంగ్ల పాలకులు కలెక్టర్ కార్యాలయంగా వినియోగించారు. స్వాతంత్య్రం అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ భవనాన్ని కలెక్టరేట్‌గా వినియోగిస్తోంది.

    అప్పటి నుంచి ప్రధానులు జిల్లాకు వచ్చినా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భాల్లేవు. హుదూద్ తుపాను జిల్లాకు తీవ్ర నష్టాన్ని మిగల్చడంతో స్వయంగా పరిస్థితిని పరిశీలించడానికి దేశ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నగరానికి వచ్చారు. మధ్యాహ్నం 1.10 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి మీదుగా నగరానికి చేరుకున్నారు. పెదజాలరిపేటను సందర్శించాక వుడా పార్కు, ఆర్కే బీచ్ మీదుగా కలెక్టరేట్‌కు వచ్చారు.

    రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఆయనకు స్వాగతం పలికాయి. ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ప్రధాన మంత్రి తిలకించారు. అనంతరం తుపాను నష్టం, చేపడుతున్న చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో 25 నిమిషాల పాటు ప్రభుత్వ నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి పయనమయ్యారు.
     

మరిన్ని వార్తలు