ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

19 Aug, 2014 02:39 IST|Sakshi
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

 శ్రీకాకుళం పాతబస్టాండ్: వివిధ సంఘాల ధర్నాలతో సోమవారం కలెక్టర్ దద్దరిల్లింది. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం ప్రతినిధులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లా  010 పద్దు కింద ప్రతీనెల జీతాలు చెల్లించాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.తిరుపతిరావు డిమాండ్ చేశారు.  వీఆర్‌ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వీఆర్‌ఏలకు 010 పద్దు కాకుండా ఇతర పద్దులతో జీతాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు.  దీనివల్ల ప్రతి నెలా జీతాలు రావడం లేదని,  మూడు, నాలుగు నెలల వరకు బకాయిలు ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  అర్హులైన, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలన్నారు.  ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యజ్జల అప్పలస్వామి, కార్యదర్శి జాజ గవరయ్య  తదితరులు పాల్గొన్నారు.
 
 బకాయి చెల్లించాలని కమ్యూనిటీ ఆరోగ్య
 కార్యకర్తలు..
 గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందిస్తున్న కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలకు బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు కె. నాగమణి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలకు  రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు చెల్లించడం లేదని విమర్శించారు. 14 నెలలుగా జీతాలు లేక కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  
 
 సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు.  అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.  రెండురోజుల్లో పరిష్కారం చేస్తానని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభ, డి.రమణరావు, డి.ఈశ్వరరావు, ఎ.భాస్కరరావు, పాపయ్య, ఆరుద్ర తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు