విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి

3 Jul, 2019 07:45 IST|Sakshi
పుదిపట్ల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటున్న కలెక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా 

పుదిపట్లలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్‌

పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆదేశం

మౌలిక వసతుల కల్పన, దాతల చేయూత అభినందనీయం

సాక్షి, చౌడేపల్లె: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా అందించాలని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త అన్నారు. పుంగనూరు పర్యటన ముగించుకుని చిత్తూరు వెళుతున్న కలెక్టర్‌ చౌడేపల్లె మండలం పుదిపట్ల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని హెచ్‌ఎం వేదవతికి సూచించారు.

విద్యార్థుల జీవితాలకు మార్గం చూపేలా బోధన సాగాలని తెలిపారు. గత ఏడాది పుదిపట్లలో 98 శాతం ఉత్తీర్ణత సాధిం చామని హెచ్‌ఎం కలెక్టర్‌కు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వాచ్‌మెన్‌ కావాలని పాఠశాల సిబ్బంది కోరారు.

పరిశ్రమల స్థాపనతో ఉపాధి 
చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో పరిశ్రమల స్థాపనతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 21 ఎంఓయూలు చేయడం ద్వారా 7,911 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 2018–19 సంవత్సరాల్లో 1,363 యూనిట్లు స్థాపించినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 175 యూనిట్లు స్థాపించినట్లు తెలిపారు. 2014–15 నుంచి 2019–20 వరకు 3,289 యూనిట్ల ద్వారా 92,697 మందికి ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. 2018–19లో మెగా పరిశ్రమల స్థాపనలో భాగంగా 9 పెద్ద పరిశ్రమలను స్థాపించామన్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించేందుకు ప్రతినెలా 5న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సింగిల్‌ డెస్క్‌ హోటల్‌ ద్వారా మూడు నెలల కాలంలో 352 దరఖాస్తులు అందగా 331 దరఖాస్తులను ఆమోదించామన్నారు. 129 పెద్ద పరిశ్రమలకుగాను 78 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎంఓయూలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ కమలకుమారి, పరిశ్రమల శాఖ జీఎం అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ జెడ్‌ఎం ఐఎల్‌.రామ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు