కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్ అసంతృప్తి

19 Jan, 2014 05:58 IST|Sakshi

ఒంగోలు, న్యూస్‌లైన్ : కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై కలెక్టర్, నగర పాలకసంస్థ ప్రత్యేకాధికారి విజయకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు రోడ్డు విస్తరణ పనుల జాప్యానికి కారకులపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మిని ఆదేశించారు. అద్దంకి బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వరకూ 1230 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పుతో సిమెంట్ రోడ్డు నిర్మించాల్సి ఉండగా కేవలం ఉత్తరం వైపు 960 మీటర్లు, దక్షిణం వైపు 740 మీటర్లు మాత్రమే రోడ్డు ఎందుకు నిర్మించారని కలెక్టర్ ప్రశ్నించారు.

కేవలం మార్జిన్ ఉన్నంత వరకే సిమెంట్ రోడ్డు నిర్మించడం సరికాదంటూ ఇంజినీరింగ్ అధికారుల పనితీరుపై మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోడ్డు ఆక్రమించి భవనాలు నిర్మించిన యజమానులకు 3 రోజుల్లో నోటీసులు అందించాలని ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే నోటీసులు ఇస్తున్నామని యజమానులకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఒంగోలు ఊరచెరువులో నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్ పనులు ప్రారంభించి రెండేళ్లయినా పనులు పూర్తికాకపోవడానికి కారణం కేవలం నిర్లక్ష్యమేనన్నారు.

బాధ్యులైన ఇంజినీర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్‌ను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో లీజుకు ఇచ్చిన షాపులు యజమానుల ఆధీనంలో కాకుండా బినామీ చేతుల్లో ఉంటే లీజులు రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహించాలని సూచించారు. నగరపాలక సంస్థలో నిర్మించే రోడ్లకు సైడు కాల్వలు అనుసంధానం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.

 చెత్త చెదారాలను రహదారుల వెంట వేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెత్తను 3 రోజుల్లో తొలగించాలని చెప్పారు. నగరపాలక సంస్థలో ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ఎంతమంది ఉన్నారనే విషయాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో పంపాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు