పర్యటకశాఖాధికారులపై కలెక్టర్‌ ఫైర్‌

19 Nov, 2017 09:02 IST|Sakshi

కాకినాడ రూరల్‌: కాకినాడ వాకలపూడి బీచ్‌లో స్వదేశ్‌దర్శన్‌ పథకం కింద రూ. 45 కోట్లతో చేపడుతున్న పనుల్లో  నాణ్యతాలోపం కొట్టవచ్చినట్టు కనిపిస్తోందని, పనులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవంటూ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, పర్యాటకశాఖాధికారులతో కలసి శనివారం ఆయన బీచ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఫౌంటెన్, ల్యాండ్‌ స్కేపింగ్, షాపింగ్‌ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్‌ హాలు, లేజర్‌షో, ఏసీ థియేటర్‌ పనులను ఆయన పరిశీలించారు. ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు మందకొడిగా జరుగుతుండడం, ఆ పనులు కూడా సక్రమంగా లేకపోవడంతో అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిసెంబర్‌ 10 నాటికి అన్ని పనులు పూర్తికావాలన్నారు. బీచ్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఏఏ షాపులు ఏర్పాటు చేస్తున్నారని పర్యాటకశాఖ ఆర్డీ జి. భీమశంకరాన్ని ప్రశ్నించగా ఆయన సరిగా బదులివ్వలేదు. అక్వేరియం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడంతో అతనిని పిలిపించండని ఆదేశించారు. దాంతో వచ్చిన వ్యక్తిని అక్వేరియం ఎలా ఏర్పాటు చేస్తున్నారని అడగగా తనకు ఏమీ తెలియదని, భీమశంకరం రమ్మంటే వచ్చానని చెప్పడంతో కలెక్టర్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే భీమశంకరాన్ని సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యుత్‌ లైటింగ్‌కు ఏర్పాటు చేసిన స్తంభాలు తుప్పపట్టి ఉండడంతో విద్యుత్‌శాఖాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీచ్‌లో హైమాస్ట్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని, విద్యుత్‌ స్తంభాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

19, 20, 21 తేదీల్లో బీచ్‌ ఫెస్టివల్‌
డిసెంబర్‌ 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్‌ బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభం రోజునముఖ్య మంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున  తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. సామర్లకోట, కాకినాడ నగరం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటుచేయాలన్నారు. ప్రముఖులు నేరుగా సభాస్థలికి రావడానికి వీలుగా ప్రత్యేక మార్గం కేటాయించాలన్నారు. బీచ్‌ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు జాయింట్‌ కలెక్టర్‌ ఎ. మల్లికార్జున నోడల్‌ అధికారిగా ఉంటారని కలెక్టర్‌ తెలిపారు. డిసెంబర్‌ 21న సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ హాజరవుతారని ఆయన సమక్షంలో జరిగే రాక్‌ డ్రమ్స్‌ ప్రదర్శన ఎంపిక జాతీయ స్థాయిలో జరుగుతుందన్నారు. అనంతరం వాకలపూడి బీచ్‌ మార్గాన్ని కూడా కలెక్టర్‌  పరిశీలించారు. జేసీ మల్లికార్జున, కాకినాడ ఆర్డీవో ఎల్‌ రఘుబాబు, సమాచారశాఖ డీడీ ఎం ఫ్రాన్సిస్, పర్యాటకశాఖ ఈఈ శ్రీనివాసరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా