ఆర్థిక స్వార్థం వల్లే టెన్త్‌ పరీక్షల్లో కాపీయింగ్‌

30 Mar, 2018 13:13 IST|Sakshi
విద్యాశాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భాస్కర్‌

కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌

ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆర్థిక స్వార్థం వల్లే పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతితీరుపై ఆయన సమీక్షించారు. ఇటీవల నిర్వహించిన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో చాలాచోట్ల కాపీలు జరిగాయంటే డబ్బులే ప్రధాన కారణంగా భావిస్తున్నానని, డబ్బులు తీసుకుని కాపీలను ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. ఒక విద్యార్థి విషయంలో డీఈఓ మళ్లీ పరీక్ష రాయించడాన్ని కలెక్టర్‌ తప్పుపట్టారు. ఏ అధికారంతో ఒక విద్యార్థితో తిరిగి జవాబులు రాయించారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌ విధానం ద్వారా అవినీతికి అడ్డుకట్ట
జిల్లాలో హాస్టళ్లలో ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేయడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయగలిగామని కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు తీరు, స్కాలర్‌షిప్‌ల జారీ వంటి అంశాలపై కలెక్టర్‌ సమీక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో 8 వేలమంది విద్యార్థులను చేర్చుకోగా అందులో 6,700 మంది హాజరవుతున్నట్టు ఇన్నాళ్లూ అధికారులు లెక్కలు చూపించారని, బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయడంతో హాస్టళ్లలో ఉండేవారి సంఖ్య కేవలం 4,800 మందికి మించలేదన్నారు. డీఈఓ సీవీ రేణుక, అదనపు జేసీ షరీఫ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ రంగలక్ష్మీ దేవి, బీసీ సంక్షేమశాఖాధికారి జి.లక్ష్మీప్రసాద్‌ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాలు నివారించాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఒక్క మనిషి కూడా చనిపోకుండా ఉండేలా ప్రణాళిక రూపొందించాలే తప్ప మరణాల సంఖ్యను తగ్గిస్తామంటూ నివేదికలు సమర్పించడం ఏమిటని కలెక్టర్‌ భాస్కర్‌ రవాణా శాఖాధికారులను ప్రశ్నించారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం రాత్రి జిల్లా స్థాయి రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశానికి కలెక్టర్‌ భాస్కర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

9 నుంచి సమ్మెటివ్‌ పరీక్షలు
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి సమ్మెటివ్‌(ఎస్‌ఏ –2) పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థ(ఎస్‌సీఈఆర్‌టీ) డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని తెలిపారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 1 నుంచి 9వ తరగతి వరకూ ఎస్‌ఏ 2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వీటిలో భాగంగా 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి  మధ్యాహ్నం 12.15 గంటల వరకూ, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

మార్పులకు అనుగుణంగా జివి మాల్‌
ఏలూరు (మెట్రో): రిటైల్‌ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్స్‌టైల్స్‌ రంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు జివి మాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాల్‌ ఎమ్‌డి జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆకర్‌‡్షప్రైడ్‌లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని దుకాణాల కంటే భిన్నంగా 365 రోజులు ఒకే ధరను తమ మాల్‌లో వస్త్రాలపై నిర్ణయించామని చెప్పారు. లక్కీషాపింగ్‌మాల్‌ అధినేత రత్తయ్య, ఏలూరు జివి మాల్‌ అధినేత కె.రామకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు