‘గురుకులం’పై కలెక్టర్‌కు నివేదిక

16 Dec, 2013 07:19 IST|Sakshi

నాయుడుపేట, న్యూస్‌లైన్:  ‘మీ బిడ్డలకైతే ఈ ఆహారం పెడతారా ?’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనంలో నాయుడుపేట ఆర్డీఓ ఎంవీ రమణ స్పందించారు. వెంటనే ఆయన పుదూరులోని బాలికల గురుకులంకు చేరుకుని అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భోజనం అందిస్తున్న తీరుపై విద్యార్థులను విచారించారు. బియ్యంలో వడ్ల గింజలు ఏరని విషయాన్ని ప్రస్తావించారు. ఇది గమనించిన గురుకులం సిబ్బంది హడావుడిగా బియ్యంలో వడ్లను ఏరించి ఆర్డీఓకు చూపించారు.
 
 విచారణకు వస్తున్నామని తెలిసి వడ్ల గింజలు ఏరారా..అని ప్రిన్సిపల్ కిరణ్మయిని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల అవసరాల మేరకే బియ్యాన్ని సివిల్ సప్లయిస్ గోదాముల నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. బియ్యం నిల్వ ఉన్నందున పురుగులు పడుతున్నాయన్నారు. గురుకులంలో ఎలాంటి సమస్య వచ్చిన సమాచారం అందించాలని సూచిస్తూ ఆర్డీఓ తన సెల్ నంబరును విద్యార్థులకు అందించారు. మెనూలో కోత విధిస్తుండటంపై భోజన ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు. గురుకులంలోని పరిస్థితులపై కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్‌రావు, సీనియర్ అసిస్టెంట్ చేవూరి చెంగయ్య  ఉన్నారు.

మరిన్ని వార్తలు