దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు

26 Nov, 2013 07:09 IST|Sakshi

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల ఖమ్మం రోటరీనగర్‌లో కొంత మంది యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డొచ్చిన వారిపై దాడులు చేసిన సంఘటనలు లాంటి పునరావృతమైతే సహించేదిలేదన్నారు. ఎస్పీకి అందిన ఫిర్యాదుల్లో కొన్ని...
     పెళ్లయి ఇద్దరు పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల తమ కూతుర్ని మాయమాటలు చెప్పి ఎటో తీసుకెళ్లాడంటూ పండితాపురానికి చెందిన కనమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. కామేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి నెలరోజులవుతున్నా ఆచూకీ లభించలేదని తెలిపింది. దీనిపై ఎస్పీ స్పందిస్తూ కేసు పురోగతికి ఎందుకు ఆలస్యమవుతోందని ఎస్సైని ఫోన్ ద్వారా ఆరా తీశారు.  
     పెళ్లి చేసుకుంటానంటూ పదేళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యక్తి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం రాగానే పెళ్లికి నిరాకరిస్తున్నాడని గార్ల మండలం ముడుతండాకు చెందిన మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గార్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానని, ఒకరోజులోనే బెయిల్‌పై విడుదలయ్యాడని చెప్పింది. తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
     వీఆర్వోగా పనిచేస్తున్న తమ తమ్ముడు ఇద్దరు సోదరులకు తెలియకుండా పహాణీల్లో పేర్లు మార్చి భూమి కాజేశాడని రఘునాథపాలెం మండలం బల్లేపల్లికి చెందిన ఎస్.కె.మధార్ ఫిర్యాదు చేశాడు.
     తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ  హైదరాబాద్‌లో ఉంటున్నాడని పాల్వంచకు చెందిన సునీత ఫిర్యాదు చేసింది. ఉద్యోగ వేటలో ఉన్నానంటూ నమ్మబలుకుతూ అక్కడే ఉంటున్నాడని, దీనిపై పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపింది. దీంతో తన భర్త ముందస్తు బెయిల్ తీసుకున్నాడని పేర్కొంది. దీనిపై ఎస్పీ స్పందిస్తూ ఇందులో ఎస్సై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బాధితురాలు ఇచ్చిన మరో ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఆమె భర్తను అరెస్టు చేయాలని ఆదేశించారు.
     రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న తనకు న్యాయం చేయాలని జూలూరుపాడుకు చెందిన వృద్ధుడు విజ్ఞప్తి చేశాడు. ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తొలుత న్యాయవాది చెప్పాడని, ఇప్పుడు డబ్బులు రావని అంటున్నారని పేర్కొన్నాడు.  
     ముహూర్తం ఖరారై రూ. 3 లక్షలు కట్నంగా తీసుకున్న వ్యక్తి తమ కూతురితో పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడంటూ మణుగూరుకు చెందిన దంపతులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.    
 

మరిన్ని వార్తలు