లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

23 Mar, 2020 15:37 IST|Sakshi

ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవు..

మీడియా సమావేశంలో వైఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ అన్బురాజన్‌

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ హరికిరణ్‌ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్‌ ‌, ఎస్పీ అన్బురాజన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించిందని తెలిపారు. ప్రైవేట్‌ వాహనాల ద్వారా రవాణాను నిషేధించామని పేర్కొన్నారు. ఒకే చోట 10 మందికి మించి గుమికూడి ఉండకూడదని తెలిపారు. నిత్యావసర వస్తువులు, మెడిసిన్‌, కూరగాయల అమ్మకాలు తప్ప మిగతా వ్యాపారాలన్నీ బంద్‌ చేయాలని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఈ నెల 31 వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం తగ్గించాలని చెప్పారు. బ్యాచ్‌లుగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తారని వెల్లడించారు. రైళ్లు, ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేశామన్నారు. జిల్లాలోని అన్ని షాపింగ్‌ మాల్స్‌, సినిమాహాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ ఫుల్స్‌ మూసివేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. (కరోనా కట్టడికి మేము సైతం..) 

వారందరు కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు..
‘‘గల్ఫ్ దేశాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం మన జిల్లాకు చెందిన వారు వెనక్కి వచ్చారు...దాదాపు 2,805 మంది వివిధ దేశాల నుండి జిల్లాకి వచ్చారు.. వలంటీర్ల ద్వారా వారి సమాచారం సేకరించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నాం. వారందరు కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.  కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని’’ ఆయన కోరారు. ప్రభుత్వ సూచనలు అమలు చేసి.. ప్రజలను అప్రమత్తం చేయడానికి మండలంలో తహసీల్దార్ చైర్మన్ గా వ్యవహరిస్తారన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 24 గంటలు  కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని.. 08562- 254259, 259179 ఈ రెండు నంబర్లలో ఎప్పుడైనా సంప్రదించవచ్చని వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రేషన్ సరుకులను ఈ నెల 29న  ప్రతి లబ్ధి దారునికి అందజేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. (తెలంగాణలో 30కి చేరిన కరోనా కేసులు) 

అదే స్ఫూర్తి కొనసాగించాలి: ఎస్పీ
జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో ఏప్రిల్‌ 5 వరకు అదే కర్ఫూ కొనసాగించాలని.. ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ప్రజల మంచి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. జాతరలు, దేవరలు వాయిదా వేసుకోవాలని సూచించారు. పోలీసులు అనుమతి లేనిదే జాతరలు నిర్వహించకూడదని తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెడిసిన్‌, ఇతర నిత్యావసర వస్తువులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించకూడదని తెలిపారు. కరోనా వైరస్‌పై దుష్ప్రచారం చేసిన వారిపై ప్రొద్దుటూరులో కేసు నమోదు చేశామని చెప్పారు. అధికారిక సమాచారం లేకుండా సోషల్‌ మీడియాలో ఎటువంటి పోస్ట్‌లు చేయరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్‌ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు