అసత్యాలు ప్రచారాలు చేస్తే శిక్ష  తప్పదు

12 Apr, 2020 19:19 IST|Sakshi

కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌

సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా అన్ని చర్యలు చేపట్టామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ..కరోనాపై పోరాడుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకాధికారి సిద్దార్థ జైన్‌, ఇతర ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కరోనా నివారణ చర్యలు, పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించామని వెల్లడించారు. కరోనా శాంపిల్స్‌ చెక్‌ చేయడానికి ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు జిల్లాకు రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా ఒకే రోజులో  వెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించవచ్చన్నారు.

సోమవారం నుంచి అధిక సంఖ్యలో నమూనాలను సేకరిస్తామని తెలిపారు. రేపటి నుంచి నుంచి కొత్తపేట,రాణిగారి తోట, జగ్గయ్యపేట, ముప్పాళ్ల, రాఘవాపురంలో శాంపిల్స్‌ సేకరణ జరుగుతుందన్నారు. కరోనా అనుమానం ఉన్న ప్రతిఒక్కరూ శాంపిల్స్‌ ఇవ్వాలని కోరారు. మంగళవారం ఖుద్దూస్‌ నగర్‌, మచిలిపట్నం, నూజివీడులో పరీక్షలు చేస్తారన్నారు. లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ పాటించి..ఇంటికే పరిమితం కావాలని ప్రజలకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలకు నిత్యావసరాలు పంపిస్తున్నామని పేర్కొన్నారు.

సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై అసత్యాలు ప్రచారం చేస్తే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. అధికారికంగా ఇచ్చే ప్రకటనలను మాత్రమే ప్రజలకు తెలియజెప్పాలని కోరారు. ప్రభుత్వాసుపత్రి రాష్ట్ర కొవిడ్‌ సెంటర్‌గా ఉండటంతో సాధారణ ఓపి సేవలను నిలిపివేశామన్నారు. వారి కోసం ఇఎస్‌ఐ ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు