తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్

9 May, 2020 14:14 IST|Sakshi
కలెక్టర్‌ ఇంతియాజ్‌

కలెక్టర్‌ ఇంతియాజ్

సాక్షి, విజయవడ: విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. సోమవారం ఉదయానికి తొలి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనుందన్నారు.  ముంబాయి నుంచి హైరారబాద్‌లోని  శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్టుకు తరలింపు జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. (కేర్‌ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!)

కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారంతా గన్నవరం ఎయిర్‌పోర్టుకే వస్తారని ఆయన చెప్పారు. 14 రోజులపాటు క్వారెంటైన్‌కు తరలిస్తామన్నారు. ప్రభుత్వ క్వారెంటైన్‌లో ఉండేందుకు ఇష్టపడని వారికోసం పెయిడ్ క్వారెంటైన్‌ కేంద్రాలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. విజయవాడలోని పలు హోటళ్లు, లాడ్జ్‌ల్లో 1200 రూములు సిద్ధం చేశామన్నారు.నాలుగు కేటగిరీలుగా రూములను కేటాయిస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్‌లో హోటళ్లకు తరలిస్తామని చెప్పారు.

14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని వివరించారు. పెయిడ్ క్వారెంటైన్ల వద్ద మెడికల్ టీం, పారిశుధ్య సిబ్బంది ఉంటారని తలిపారు.  పోలీసుల పర్యవేక్షణ ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌ని వినియోగిస్తామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. (ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు