ఓట్ల తొలగింపునకు 66,254 దరఖాస్తులు

6 Mar, 2019 13:03 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యనారాయణ

ఆళ్లగడ్డలో అత్యధికం

అనవసరంగా ఒక్క ఓటు కూడా తొలగించం

బల్క్‌గా ఫారం–7 అప్‌లోడ్‌పై 21 కేసుల నమోదు

కలెక్టర్‌ సత్యనారాయణ వెల్లడి

కర్నూలు(అగ్రికల్చర్‌): గత ఏడాది నవంబర్‌ ఒకటి నుంచి ఈ నెల నాల్గో తేదీ వరకు ఓట్ల తొలగింపునకు ఫారం–7 దరఖాస్తులు 66,254 వచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో 14,574 దరఖాస్తులపై విచారణ పూర్తి చేశామని, 51,680 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వీటిపై బుధవారం సాయంత్రంలోగా విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘ఓటుపై కుట్ర’ శీర్షికతో ప్రచురితమైన  కథనానికి కలెక్టర్‌ స్పందించారు. సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి..ఓట్ల తొలగింపు, నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు, బల్క్‌ ఫారం–7 దరఖాస్తులపై కేసులు తదితర వివరాలను వెల్లడించారు. విచారణ లేకుండా, అనవసరంగా ఏ ఒక్క ఓటునూ తొలగించబోమన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనుమతి లేకుండా ఓట్లను తొలగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుపై ప్రజల్లో ఉన్న సందేహాల నివృత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలగింపునకు దరఖాస్తు చేసిన వారితో పాటు ఓటర్లకూ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఐపీ నంబరు ఆధారంగా దరఖాస్తు చేసిన వారి అడ్రెస్‌లకు వెళ్లి విచారణ చేస్తామని, లేదని చెబితే అటువంటి ఓటర్లను తొలగించే అవకాశం ఉండదని వివరించారు. ఓట్ల తొలగింపునకు అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9,997, ఆదోని 9,786, పత్తికొండ 7,942, ఆలూరులో 7,951  దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వీటిపై విచారణ చురుగ్గా సాగుతోందన్నారు. ఇది వరకే తొలగించి ఉంటే అటువంటి వారు వెంటనే ఫారం–6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

21 కేసుల నమోదు
బల్క్‌గా ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఇప్పటి వరకు 21 కేసులు నమోదయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. డోన్‌ నియోజకవర్గంలో 2, పత్తికొండ 3, ఎమ్మిగనూరు 2, ఆదోని 1, ఆలూరు 7, ఆళ్లగడ్డలో 6 కేసులు నమోదైనట్లు చెప్పారు. జిల్లాలో డెమొగ్రాఫికల్‌ సెమిలర్‌ ఎంట్రీస్‌ (డీఎస్‌ఈ) 11,155 ఉన్నాయని, వీటిపై విచారణ పూర్తయ్యిందని, ఇందులో 2,871 ఓట్లు తొలగించేందుకు గుర్తించామని తెలిపారు. ఆళ్లగడ్డ 158, శ్రీశైలం 221, నందికొట్కూరు 135, కర్నూలు 185, పాణ్యం 305, నంద్యాల 189, బనగానపల్లి 204, డోన్‌ 278, పత్తికొండ 209, కోడుమూరు 20, ఎమ్మిగనూరు 207, మంత్రాలయం 199, ఆదోని 193, ఆలూరులో 187 ప్రకారం డీఎస్‌ఈ ఓటర్లను తొలగించనున్నట్లు వివరించారు.   

ఓటరు నమోదుకు 2,35,585 దరఖాస్తులు
ఓటరు నమోదు కోసం ఇప్పటి వరకు 2,35,585 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో 1,91,844 దరఖాస్తులపై విచారణ పూర్తయ్యిందని, మిగిలిన వాటిపై బుధవారం సాయంత్రంలోగా విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు.  అర్హత ఉన్నట్లు తేలితేనే ఓటర్లుగా గుర్తిసామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాల్సిన అవసరం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో డీఆర్‌వో వెంకటేశం, ఎన్నికల సెల్‌ ఇన్‌చార్జ్‌ లక్ష్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు