భరత్‌ అనే నేను..

7 Jun, 2020 07:57 IST|Sakshi

కలెక్టర్‌గా విధుల్లో చేరి ఏడాది పూర్తి 

జిల్లా అభివృద్ధికి విశేష సేవలు 

కరోనా కట్టడిలో ప్రముఖ పాత్ర 

భరత్‌గుప్తకు పలువురి అభినందనలు

కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. పడినా లేస్తున్నందుకు అంటారు.. జిల్లా కలెక్టర్‌ నారాయణభరత్‌గుప్త. కష్టాలకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. కలెక్టర్‌ అనే దర్పం లేకుండా.. అందరితో కలిసిపోతున్నారు. ప్రజాసేవకే అంకితమవుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నారు. ఆయన కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..   

సాక్షి, చిత్తూరు‌: డాక్టర్‌ వృత్తిని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఐఏఎస్‌ వైపు అడుగులు వేశారు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆయన ఉన్నత విద్య అనంతరం ఎంబీబీఎస్‌ చేశారు. డాక్టర్‌ వృత్తిలో స్థిరపడ్డారు. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో చికిత్స కోసం వచ్చే పేదల కష్టాలను చూసి ఐఏఎస్‌ కావాలని నిర్ణయించుకున్నారు. ఆ వృత్తిని వదులుకుని ఐఏఎస్‌కు శిక్షణ పొందారు. మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ సాధించారు. శిక్షణ ముగించుకున్న తరువాత జిల్లాలోని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్‌ పొందారు.

కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తకు జ్ఞాపిక ఇస్తున్న తిరుపతి కమిషనర్‌ గిరీషా, ఇతర అధికారులు
సబ్‌ కలెక్టర్‌ నుంచి కలెక్టర్‌ వరకు 
జిల్లాలో సబ్‌ కలెక్టర్‌గా విధుల్లో చేరిన నారాయణభరత్‌గుప్త ప్రస్తుతం ఇదే జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలో మదనపల్లె సబ్‌ కలెక్టర్‌గా, అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, శ్రీశైలం ఈఓగా, రాష్ట్ర పవర్‌ కార్పొరేషన్‌ శాఖలో విధులు నిర్వర్తించారు. 2019 జూన్‌ 6న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మూడు పోస్టుల్లో పనిచేసిన ఆయనకు జిల్లాపై మంచి పట్టు ఉంది.  చదవండి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌కు నోటీసులు

మృధు స్వభావి 
కలెక్టర్‌ అనే దర్పం లేదు. అందరితోనూ కలిసిపోయే స్వభావం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, మృధు స్వభావిగా భరత్‌గుప్త పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జిల్లాలో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. రెండు నెలలుగా జిల్లాలో కరోనా విపత్కర పరిస్థితి నెలకొంది. జిల్లా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఆయన నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెడ్‌జోన్లలో కలియతిరుగుతున్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాలకు వెంటనే చేరుకుని అక్కడ అధికారికంగా చేపట్టాల్సిన చర్యలపై దగ్గరుండి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. కరోనా కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన విధుల్లో చేరి శనివారంతో ఏడాది పూర్తయ్యింది. జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) మార్కండేయులు, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) చంద్రమౌళి, తిరుపతి మునిసిపల్‌ కమిషనర్‌ గిరీషా, ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్, చిత్తూరు మునిసిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, పుంగనూరు మునిసిపల్‌ కమిషనర్‌ వర్మ, పలువురు జిల్లా అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.     

మరిన్ని వార్తలు