నీతూప్రసాద్ రూటెటు?

25 Dec, 2014 00:27 IST|Sakshi
నీతూప్రసాద్ రూటెటు?

సాక్షి ప్రతినిధి, కాకినాడ : అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి గురు, శుక్రవారాల్లో వచ్చే  సీల్డ్‌కవర్‌పైనే దీనిపై స్పష్టత వస్తుందని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం సీల్డ్‌కవర్ వచ్చినా క్రిస్మస్ సెలవు కావడంతో శుక్రవారమే విషయం వెల్లడి కానుంది.

 

విభజన అనంతర పరిణామాల్లో కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఏపీఎస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అఖిలభారత సర్వీసు అధికారుల విషయం కేంద్రప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆరు నెలలుగా కలెక్టర్ బదిలీ విషయం తేలలేదు. ఇపుడు అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నీతూప్రసాద్ జిల్లాలో కొనసాగేది లేనిదీ మరో 24 గంటల్లోపు తేలిపోనుంది.
 
 తెలంగాణాకు మొదట్లో ఆప్షన్ ఇచ్చినప్పటికీ, భర్త గుంటూరులో పనిచేస్తుండటం, ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు దగ్గరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో నీతూప్రసాద్ తెలంగాణకు వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల ఆమెను ఇక్కడే కొనసాగాలని ఇప్పటికే కోరారు. అయితే ఇప్పుడు కేంద్రం విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె అటా, ఇటా అనే దానిపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా నీతూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా వచ్చారు.  విజయవాడ- గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్న తరుణంలో కీలకమైన గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్టుకి ఆయన బదిలీ అయ్యారు.
 
 దీంతో ఆయన ఆంధ్రాలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలియవచ్చింది. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అధికారులను తీసుకువస్తే వారు అలవాటు పడేందుకు చాలా సమయం పడుతుందని..ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఉన్నారంటున్నారు. అందుకే నీతూప్రసాద్‌నే పుష్కరాల వరకూ కలెక్టర్‌గా కొనసాగిస్తారని ప్రచారం జరిగింది.

 

కానీ తెలంగాణకు వెళ్లేందుకు ఎంచుకున్న ఆప్షన్‌ను కేంద్రం యథాతథంగా ఆమోదిస్తే పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆమెకు వెంటనే కలెక్టర్‌గా అక్కడ అవకాశం దక్కుతుందా లేదా? అక్కడకు వెళితే పదోన్నతులు త్వరగా వస్తాయా...ఇత్యాది విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కనీసం పుష్కరాల వరకు ఆమె కొనసాగుతారా? ఈలోపే జిల్లా నుంచి బదిలీ అవుతారా అనే ఆసక్తి నేపథ్యంలో అసలు సీల్డ్‌కవర్‌లో ఏముందనే అంశం ఉత్కంఠ  రేకెత్తిస్తోంది.
 

మరిన్ని వార్తలు