ఇక వెళ్లక తప్పదు..!

4 Sep, 2014 01:00 IST|Sakshi
ఇక వెళ్లక తప్పదు..!

 సాక్షి, కాకినాడ :జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రాలోనే కొనసాగాలన్న ఆమె ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వీల్లేకుండా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో దార్లన్నీ మూసుకుపోయినట్టు కనిపిస్తోంది. రాష్ర్ట విభజనతో నీతూప్రసాద్ తొలుత తెలంగాణ ను ఎంచుకున్నారు. ఇంతలో ఆమె భర్త, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్‌కుమార్‌ను గుంటూరు అర్బన్‌ఎస్పీగా బదిలీ చేయడంతో పాటు ఏపీలోనే  కొనసాగాలన్న  రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడితో తెలంగాణ  విషయంలో ఆమె పునరాలోచనలో పడ్డారు. దీనికి తోడు రాజేష్‌కుమార్ కూడా ఏపీలోనే కొనసాగేందుకు మొగ్గడంతో తాను కూడా ఇక్కడే ఉండి పోవాలని ఆశించారు.
 
 ఏపీలో కొనసాగితే కృష్ణా లేదా గుంటూరు జిల్లాకు బదిలీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా ఆమెకు హామీ లభించింది. ఏపీ ప్రభుత్వం అభిలాష మేరకు ఇక్కడే కొనసాగితే కోరుకున్న పోస్టింగ్‌ను దక్కించుకోవడంతో పాటు మంచి గుర్తింపు పొందవచ్చన్న ఆలోచనతో ఏపీ కేడర్‌లోనే కొనసాగాలని నీతూప్రసాద్ భావించారు. స్పౌజ్ ఆప్షన్ (భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రాంతంలో పనిచేసే వెసులుబాటు)ను ఉపయోగించుకుని ఏపీ లోనే కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కేంద్రానికి ఆప్షన్ కూడా పెట్టుకున్నారు. అయితే ఆమె అభ్యర్థనను ఐఏఎస్‌ల పంపిణీ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన సిన్హా కమిటీ తోసిపుచ్చింది. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌ఎలు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని  తేల్చేసింది. అందుకనుగుణంగానే కేంద్రం ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్‌లు ఆ రాష్ట్రానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.
 
 12 లోగా జాబితాలకు ఆమోదముద్ర
 అంతేకాక ఐఏఎస్‌లు వారి అభ్యంతరాలతో వేసే పిటిషన్లను స్వీకరించవద్దంటూ ముందస్తుగా సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషనూ దాఖలు చేసింది. దీంతో నీతూ ప్రసాద్ తెలంగాణ కు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఈనెల 12 లోగా ఇరురాష్ట్రాలకు కేటాయించిన ఐఏఎస్‌ఎల జాబితాలకు కేంద్రం ఆమోదముద్ర వేయనుంది.
 
 వ్యక్తిగతంగా వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకున్నా రాష్ర్టప్రభుత్వాల ఒత్తిడి మేరకు ఒకటి రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. నీతూప్రసాద్ విషయంలో ఏపీ సర్కార్ నుంచి ఒత్తిడి వస్తే కేంద్రం మార్పు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఇరు రాష్ట్రాలకు అధికారుల కేటాయింపులు జరిపినా ఒక రాష్ర్ట కేడర్‌తో విధుల్లో చేరి డిప్యుటేషన్‌పై మరొక రాష్ర్టంలో విధులు నిర్వర్తించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు. నీతూప్రసాద్‌ను రాష్ర్టంలోనే కొనసాగించాలని పట్టుదలతో ఉన్న జిల్లాకు చెందిన మంత్రి ఈ మేరకు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు