గురుకులం నిర్వహణపై  కలెక్టర్‌ కన్నెర్ర 

11 Oct, 2019 08:03 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : కలెక్టర్‌ జి.నివాస్‌ హఠాత్తుగా కంచిలిలోని ఏపీ బాలయోగి గురుకులంలో ప్రవేశించారు. నేరుగా భోజన శాల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. పిల్లలకు ఏం వడ్డించారో స్వయంగా చూసి తెలుసుకున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్దేశించిన మెనూ అమలు కాలేదని గ్రహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాల్సివుండగా.. వారు ఇళ్లకు వెళ్లినట్టు తెలుసుకొని ఆగ్రహంతో ఊగిపోయారు. గురుకులం ప్రిన్సిపాల్, నలుగురు టీచర్లు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎందుకు వడ్డించలేదని ప్రిన్సిపాల్‌ బాలాజీ నాయక్‌ను ప్రశ్నించారు.

కేవలం పప్పుచారుతోనే పిల్లలు ఎలా తింటారని నిలదీశారు. దీనికి గల కారణమేంటని ప్రశ్నించగా కూరలు తీసుకురావడం ఆలస్యమైందని ప్రిన్సిపాల్‌ చెప్పడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆ సమయంలో ఉపాధ్యాయులు, మిగ తా సిబ్బంది హాజరును పరిశీలించగా, అప్పటికి నలుగురు ఉపాధ్యాయులు, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ భోజనం చేయడానికి ఇంటికి వెళ్లారు. దీనిపై కలెక్టర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలతో కలిసి భోజనం చేయకుండా ఇంటికి వెళ్లడం ఏమిటని నిలదీశారు. పిల్లలకు పప్పుచారుపెట్టి .. మీరు మాత్రం మాంసాహా రాలుతినడానికి ఇళ్లకు వెళ్లిపోతారా అని ప్రశ్నించారు.  


నాలుగో వంతు పిల్లలు కూడా లేరు 
కలెక్టర్‌ తనిఖీ చేసిన సమయంలో 400 మంది పిల్లలకు 70 నుంచి 80 మంది మాత్రమే హాజరు కావడం, వారు కూడా యూనిఫారాలు ధరించకపోవడాన్ని కలెక్టర్‌ తప్పుబట్టారు. ఇదేం క్రమశిక్షణ అని ప్రిన్సిపాల్, సిబ్బందిని ప్రశ్నించారు. కలెక్టర్‌ పర్యటనలో గురుకుల నిర్వహణ తీరు, విద్యార్థుల వసతి తదితర అంశాలను, రికార్డులను పరిశీలించారు. దాదాపు 40 నిమిషాలపాటు ఆయన తనిఖీలు కొనసాగాయి. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ.. లోపాలకు గల కారణాలను గురుకుల సిబ్బందిని అడిగారు. వారి సమాధానాలకు కలెక్టర్‌ సంతృప్తి చెందకపోవడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళన సిబ్బందిలో కన్పించింది.

ఈ చర్యలకు బాధ్యులను చేస్తూ గురుకుల ప్రిన్సిపాల్‌ ఎన్‌.బాలాజీ నాయక్, ఉపాధ్యాయులు టి.వి.రమణ, పి.సురేష్, జి.జయరాం, పి.అమ్మాయమ్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావులను సస్పెండ్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ జి.నివాస్‌ ప్రకటించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌తోపాటు మండల ప్రత్యేకాధికారి ఆర్‌.వరప్రసాద్, తహసీల్దార్‌ కె.డిసెంబరరావు, ఎంపీడీఓ చల్లా శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ ఎస్‌.శివరాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు