రైస్‌మిల్లర్లకు షోకాజ్ నోటీసులు

20 Nov, 2013 04:29 IST|Sakshi

కలెక్టరేట్, న్యూస్‌లైన్ :  జిల్లాలో 26మంది రైస్‌మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 2012-13 సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించింది. మిల్లింగ్ చేసేందుకు చార్జీలు చెల్లిస్తోంది. మిల్లింగ్ చేసిన అనంతరం రైస్‌మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించలేదు. దీంతో సంబంధిత రైస్‌మిల్లర్లకు జాయింట్ కలెక్టర్ సుజాతశర్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైస్‌మిల్లర్ల వద్ద 14,365 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని సేకరించిన ఐదుగురు మిల్లర్లు, రబీ సీజన్‌లో సేకరించిన 21మంది రైస్‌మిల్లర్లకు నోటీసులు జారీ అయ్యాయి. బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని, లేనిపక్షంలో రెవన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్‌ను ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. 2013-14 ఖరీఫ్ సీజన్‌లో రైతుల వద్ద ఐకేపీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి ధాన్యాన్ని నోటీసులు జారీ అయిన రైస్‌మిల్లర్లకు ఇవ్వడం లేదని, కొత్త మిల్లర్లు, గత ఏడాది పూర్తి బియ్యాన్ని అప్పగించిన రైస్‌మిల్లర్లకు మాత్రమే ఈ ఏడాది ధాన్యం ఇస్తున్నామని డీఎస్‌వో వసంత్‌రావ్ దేశ్‌పాండే తెలిపారు.  
 

మరిన్ని వార్తలు