కాంట్రాక్టులు రద్దు చేయండి

9 Nov, 2013 04:11 IST|Sakshi

ఇందూరు,న్యూస్‌లైన్ : 2011-12, 2012-13 సంవత్సరానికి సంబంధించిన బీఆర్‌ఈఎఫ్ పనులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న వారి కాంట్రాక్టులను వెంటనే రద్దు చేయాలని  అధికారులను జిల్లా కలెక్టర్ ప్రద్యు మ్న ఆదేశించారు. శుక్రవారం  జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బీఆర్‌జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం పనులు , నిధుల ఖర్చుపై మున్సిపల్ కమిషనర్‌లతో, ఎంపీడీఓలతో ఆయన సమీక్షించారు.  ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్టర్లు తీసుకున్న పనులను పూర్తి చేయకపోవడంతో ప్రజలకు సౌకర్యాలు తొందరగా అందడంలేదన్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని, వారి కాంట్రాక్టులను రద్దు చేయాలని ఆదేశించారు. పని చేయని వారికి టెండర్లు అప్పజెప్పి కాంట్రాక్టర్లను ఊరికే పోషిస్తున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే భవన,ఇతర నిర్మాణ పనులకు కొందరు వ్యక్తులు అడ్డు పడుతున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
 
 ప్రస్తుతం బీఆర్‌జీఎఫ్, 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ నిధులు ప్రభుత్వం విడుదల చేసినందున గ్రామ సర్పంచులతో కలిసి పనులను గుర్తించాలన్నారు. ఇలా గ్రామాల వారీగా పనులను గుర్తించి పూర్తిగా మండలానికి సం బంధించిన యాక్షన్ ప్లాన్‌ను 15 రోజుల్లో రూపొం దించి, తనకు అందజేయాలని సూచించారు.  ఎవరికి వారు పనులకు సంబంధించిన నిధులను ఖర్చు చేయాడానికి వీలు లేదని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా నిధులు ఖర్చు చేయాలన్నారు.రాజీవ్‌గాంధీ స్వశక్తి యోజన పథకం కింద పంచాయతీ భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందని, శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనాలను గుర్తించి కొత్త భవనాలు నిర్మింపజేయాలన్నారు. ఎస్సీ,ఎస్టీ వాడల్లో తాగునీటి అవసరాలు ఉన్నాయో లేదో హాబిటేషన్‌ల వారీగా చూసుకుని, లేని చోట ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే 2011-12,13 సంవత్సరాలకు చెందిన జెడ్పీ జనరల్ ఫండ్స్, బీఆర్‌జీఎఫ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు వివరాలు మరోసారి తెలుసుకునేందుకు ఈ నెల 23న మళ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
 పలువురిపై ఆగ్రహం...
 పనులను పూర్తి చేస్తామని గత సమావేశంలో చెప్పిన అధికారులు పనులు పూర్తి చేయనందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ ఎంపీడీఓ రాములు కమ్యూనిటీ భవన నిర్మాణం ఆలస్యం చేయడంపై ఆయనపై మండిపడ్డారు. అలాగే ఈ నెలాఖరులోగా పనులన్ని పూర్తి కాకుంటే చర్యలు తప్పవని నిజామాబాద్, కామారెడ్డి మున్సిపల్ ఇంజినీర్లను హెచ్చరించారు.  ఈ సారి కూడా సమావేశానికి ముందే సరైన వివరాలు సిద్ధం చేసుకోకుండా రావడంపై కలెక్టర్ అసహన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు