ఇలా అయితే రోగులు ఎందుకు వస్తారు?; కలెక్టర్‌ ఆగ్రహం 

4 Dec, 2019 11:02 IST|Sakshi
ఆస్పత్రి వైద్యులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

15 రోజుల్లో తీరు మారకపోతే చర్యలు

సమయపాలన పాటించి తీరాలి

బారువ సామాజిక ఆస్పత్రి నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం  

సోంపేట: ఆస్పత్రి విధుల్లో సమయపాలన పాటించకపోతే రోగులు ఎందుకు వస్తారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని బారువ సామాజిక ఆస్పత్రి సిబ్బందిని కలెక్టర్‌ జె.నివాస్‌ హెచ్చరించారు. ఆయన మంగళవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిర్వహ ణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గదులు శిథిలావస్థలో ఉండడం, కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై సూపరింటెండెంట్‌ బాలకృష్ణను ప్రశ్నించారు. రెండు రోజుల్లోగా పరిశుభ్రం చేసి, ఫొటోలు కలెక్టరేట్‌కు పంపించాలని ఆదేశించారు. 

నెలకు నాలుగే ప్రసవాలా..?  
ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు బారువ ఆస్పత్రిలో 23 ప్రసవాలు మాత్రమే జరగడంపై కలెక్టర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి రోగులు పలాస, సోంపేట ఎందుకు వెళ్తున్నారని అడిగారు. నెలకు నాలుగే ప్రసవాలా అని ప్రశ్నిస్తూ వచ్చే నెల నుంచి సంఖ్య పెరగకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలో మరుగుదొడ్డి, వాషింగ్‌ మెషీన్‌ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మరోసారి వచ్చేటప్పటికీ ఈ సమస్యలు ఉండకూడదని వైద్యాధికారికి తెలిపారు.  

మందులు అందుతున్నాయా..?  
తనిఖీ సందర్భంగా రోగులతో కలెక్టర్‌ మాట్లా డారు. కనకయ్య అనే రోగితో మాట్లాడుతూ మందులు సక్రమంగా వేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ప్రభుత్వ నిధులతో అంబులెన్స్‌ ద్వారా శ్రీకాకుళం తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌కు సూచించారు.
 
సమయపాలన తప్పనిసరి 
అనంతరం ఆయన వైద్య సిబ్బంది హాజరును బయోమెట్రిక్‌ ద్వారా పరిశీలించి నివ్వెరపోయారు. అందరూ విధులకు గంట ఆలస్యంగా రావడంపై ప్రశ్నించారు. రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు ఇక్కడ ఉండరని, వేరే ఆస్పత్రికి వెళ్తారని సిబ్బంది కలెక్టర్‌తో చెప్పారు. ఎంఎల్‌ఓ సింహాద్రి బెహరా, వైద్య మిత్ర ఆనంద్‌ పాణిగ్రహి ఇద్దరే సమయపాలన పాటించడంతో వారిని అభినందించారు. ఆర్డీవో ఐ.కిశోర్‌ బాబు, తహసీల్దార్‌ ఎం.రవి జోసెఫ్, ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ లక్ష్మీ ప్రసన్న, డాక్టర్‌ హాస్నైన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు