ఓటరు జాబితా పవిత్ర గ్రంథం

7 Mar, 2019 13:15 IST|Sakshi

ఆరుగురు ఈఆర్వోలు, ఆరుగురు ఏఈఆర్వోలకు షోకాజ్‌ నోటీసులు

అనుమతి లేకుండా     ఓట్లు తొలగించినందుకు కలెక్టర్‌ ఆగ్రహం

8న ఎన్నికల కోడ్‌ ? బ్యానర్లు, ఫ్లెక్సీల

తొలగింపునకు ఆదేశాలు

‘‘ఈనెల 8న ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశముంది. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఒత్తిళ్లకు భయపడకూడదు. దరఖాస్తుల విచారణ మందకొడిగా సాగుతోంది. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయం. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది’’ అంటూ కలెక్టర్‌ ప్రద్యుమ్న అధికారులను హెచ్చరించారు.

చిత్తూరు కలెక్టరేట్‌ :  ఓటరు జాబితా పవిత్ర గ్రంథమని, దానిపట్ల ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటా యని కలెక్టర్‌ ప్రద్యుమ్న హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో చిన్న పొరపాట్లు లేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు, చేర్పుల కోసం అత్యధికంగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఫారం–7ను సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తులు చేశారన్నారు. వాటిని బీఎల్వోలు నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. కరెక్ట్‌గా ఉంటే ఆమోదించాలని చెప్పారు. తప్పుగా ఉంటే తిరస్కరించాలన్నారు. రాజకీ య ఒత్తిళ్లకు బీఎల్వో, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు తలొగ్గకూడదన్నారు. ఎవరు ఎంత ఒత్తిడి పెట్టినా భయపడకూడదన్నారు. ఎవరైనా ఒత్తిళ్లకు లొంగినట్లు తెలిస్తే జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తే వారికి జిల్లా యంత్రాం గం అండగా ఉంటుందన్నారు.

8న ఎన్నికలకోడ్‌ ....?
ఈనెల 8న ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశముందని కలెక్టర్‌ ప్రద్యుమ్న అన్నారు. 7న జిల్లాలోని 66 మండలాల్లో నియమించిన మానిటరింగ్‌ టీమ్‌లు, ఎంసీసీ, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు సమన్వయంతో ముం దుకెళ్లాలన్నారు. వారందరూ గురువారం నుంచి క్షేత్రస్థాయి విధుల్లో ఉండాలన్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చే లోపు ఓటరు జాబితా సిద్ధం చేయాల్సిన అవసరముందన్నారు. ఆ లోపు ప్రస్తుతం చేస్తున్న ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. చేర్పులు, మార్పులు, ఆక్షేపణలకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విచారణ చేయడానికి ఏడు రోజుల సమయంతో సంబంధం లేదన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంట నే విచారణ చేపట్టవచ్చునన్నారు. జిల్లాలో 1,12,000 దరఖాస్తులు పరిశీలన చేయాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని ఈఆర్వో, ఏఈఆర్వోలను ఆదేశించారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే దరఖాస్తుల విచారణ చిత్తూరు జిల్లాలో పనులు మందకొడిగా జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో ఉందన్నారు. దరఖాస్తుల విచారణలో ఏదో సమస్య ఉందని, అందుకే కావట్లేదన్న అనుమానం తనలో రేకెత్తిస్తోందన్నారు.

12 మందికి షోకాజ్‌ నోటీసులు
అనుమతి లేకుండా ఒక ఓటును తొలగించినందుకు తంబళ్లపల్లె ఈఆర్వో ఈశ్వరయ్యపై కలెక్టర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన అనుమతి లేనిదే ఓటును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ‘‘తమాషాలు చేస్తున్నావా.. నేను అనుకుంటే ఇప్పుడే నీ ఉద్యోగం పోతుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల ఈఆర్వోలతో రోజువారి పనితీరు నివేదికలను అడిగి తెలుసుకున్నారు. ఫారం–6,7 లలో క్షేత్రస్థాయి విచారణ, తిరస్కరణల్లో వెనుకబడి ఉన్న శ్రీకాళహస్తి, పీలేరు, సత్యవేడు, పలమనేరు, నగరి, తంబళ్లపల్లె  నియోజకవర్గాల ఆరు ఈఆర్వోలకు, అదే మండలాల ఏఈఆర్వోలు ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని జా యింట్‌ కలెక్టర్‌ గిరీషను ఆదేశించారు.

బ్యానర్లు, ఫ్లెక్సీలు కనబడకూడదు
జిల్లాలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ పథకాల ప్రచార బ్యానర్లు గురువారం నుంచి తొలగించే కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు. 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం, 15న  వినియోగదారుల అవగాహన దినోత్సవం కార్యక్రమాలను అధి కారికంగా నిర్వహించాలన్నారు. నాయకులను ఆహ్వానించకూడదని చెప్పారు.

>
మరిన్ని వార్తలు