నిందితులను వదిలే ప్రసక్తేలేదు

13 Aug, 2018 11:56 IST|Sakshi
డాక్టర్‌ శిల్ప మృతి కేసు వివరాల పత్రాలను పరిశీలిస్తున్న సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌బాషా

శిల్ప ఆత్మహత్య కేసుపై

కలెక్టర్‌ ప్రద్యుమ్న సీరియస్‌

కళాశాలలో వేధింపుల నివారణ కమిటీల రద్దు

కొత్త కమిటీల ఏర్పాటుకు చర్యలు

చిత్తూరు అర్బన్‌: తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప మృతికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్‌ పిఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. ఆయన ఆదివారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడతూ శిల్ప ఆత్మహత్మకు కారకులపై ప్రాథమికంగా చర్యలు తీసుకున్నామన్నారు. అధ్యాపకులను విధుల నుంచి తొలగించామని, ప్రిన్స్‌పాల్‌ను బదిలీ చేశామన్నారు. మరికొందరు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కళాశాలలో మహిళలపై వేధింపులను నివారించడానికి ఉన్న కమిటీలు రద్దు చేసి, కొత్త వాటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు ఏవైనా ఇబ్బందులొస్తే వెంటనే చర్యలు తీసుకునేలా కమిటీలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

కొనసాగుతున్న సీఐడీ విచారణ
పీలేరు: డాక్టర్‌ శిల్ప ఆత్మహత్యపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది. కేసును సీఐడీకి అప్ప గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం పీలేరు అర్బన్‌ సీఐ సిద్ధ తేజమూర్తి కేసుకు సంబందించిన రికార్డులను సీఐడీ డీఎస్పీ రమణకు అప్పగించారు. రంగంలోకి దిగిన సీఐడీ అధికారుల బృందం మృతురాలి తల్లిదండ్రులు రాధ, రాజగోపాల్, సోదరి శృతి, భర్త డాక్టర్‌ రూపేష్‌కుమార్‌రెడ్డి, ఇతర కుటుంబ సబ్యులను వేర్వేరుగా విచారిస్తున్నారు. మృతికి దారితీసిన వివరాలను సేకరించినట్టు తెలిసింది. అలాగే శిల్ప ఆత్మహత్య చేసుకున్న అపార్ట్‌మెంట్‌ను తనిఖీ చేశారు. ప్రొఫెసర్ల వేధింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శిల్ప ఎటువంటి ఆరోపణలు, వాంగ్మూలం లేకుండానే ఎలా చనిపోయిందన్న కోణంలో సీఐడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. విచారణపై సీఐడీ అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు