ఒట్టేసి చెబుతున్నా.. నిర్లక్ష్యం చేస్తే ఇంటికే..

13 Mar, 2018 09:19 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న

జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న

వరదయ్యపాళెం/పిచ్చాటూరు/కేవీబీపురం: ‘ఒట్టేసి చెబుతున్నా..మహిళల ఆత్మగౌరవం పేరుతో నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి లక్ష్యం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులైన ఇళ్లకు పంపడంలో వెనుకడుగు వేసేది లేదు’ అని జిల్లా కలెక్టర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. వరదయ్యపాళెంలోని ఒన్నెస్‌ కోచింగ్‌ సెంటర్‌లో సత్యవేడు, వరదయ్యపాళెం మండలాలకు చెందిన అధికారులతో ఓడీఎఫ్, నరేగా పథకాల గురించి జిల్లా కలెక్టర్‌ సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మ రుగుదొడ్డి నిర్మాణాల నిధులకు కొరత లేదని ప్రస్తుతం జిల్లాకు రూ.625 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

ఇప్పటికే జిల్లాలో 2లక్షల మరుగుదొడ్లు నిర్మించామని, మరో 80వేల మరుగుదొడ్లు నిర్మిస్తే ఓడీఎఫ్‌ ఖాతా లోకి చేరుకుంటామన్నారు. శ్రమకు తగి న ఫలితం రావాలంటే ఈనెల 30 లోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే సత్యవేడు మండలంలోని కన్నవరం, మల్లవారిపాళెం, పెద్దఈటిపాకం, సత్యవేడు, వానెల్లూరు పంచాయతీలలో 1012 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ లక్ష్యం పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం కేవీబీపురం మండలంలోని ఐకేపీ(వెలుగు)కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 29 పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బందితో మరుగుదొడ్డి నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిచ్చాటూరు మండలం ఎంపీడీఓ కార్యాలయలో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మరుగుదొడ్లు టార్గెట్‌లను తప్పక పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు. కీళపూడి, ముడియూరు పంచాయితీలలో నిర్మాణాలు వేగవంతం చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు