మాతృమరణాలు తగ్గవా?

1 Jun, 2018 13:08 IST|Sakshi
అధికారులను నిలదీస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయ్‌

క్షేత్రస్థాయిలో యాంత్రాంగం ఉండి కూడా ఎం జరుగుతోందో అర్థం కావడం లేదు

ఫలితాలు రాకపోతే ఎలా వైద్యాధికారులపై మండిపడిన కలెక్టర్‌

సాక్షి, విశాఖపట్నం: ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా మీరు..? మాతృమరణాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు..? అంటూ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్య ఆరోగ్యశాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌ మీటింగ్‌ హాలులో మాతృమరణాలపై సమీక్షించారు. గత క్వార్టర్లీ సమావేశంలో 12 మాతృమరణాలు సంభవిస్తేనే చాలా ఎక్కువని భావించామని, కానీ ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 16 మరణాలు చోటుచేసుకున్నాయంటే ఏం అనుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మాతృమరణాల ప్రాంతాల మెడికల్‌ ఆఫీసర్లు, ఎఎన్‌ఎంలు, ఆశావర్గర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌వోను ఆదేశించారు.

పునరావృతం కాకుండా చూడాలన్నారు. హైరిస్క్‌ కేసులను ముందుగానే గుర్తించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరం మేరకు మందులు, పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి తీవ్రతను బట్టి దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రుల్లో చేర్పించాలన్నారు. హెచ్‌బీ, బీపీ, తదితర పరీక్షలను నిర్వహించాలన్నారు. ఏజెన్సీలో సరైన రోడ్డు సౌకర్యం లేక వాహనాలు అందుబాటులో లేక గర్భిణులు, బాలింతలు నడిచి వెళ్లడం వంటి కారణాల వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని వైద్యాధికారులు వివరించగా కలెక్టర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్చించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లలో హైబీపీ, హైపోథైరాయిడ్, గుండె సంబంధిత సమస్యల వల్ల 16 మాతృ మరణాలు సంభవించాయన్నారు. మాతృమరణాలు తగ్గించేందుకు పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక వైద్యాధికారులతో శిక్షిణ ఇస్తామన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాయక్, జిల్లా వైద్యాధికారులు, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు