ఓట్ల తొలగింపు కుదరదు

11 Mar, 2019 12:57 IST|Sakshi
ఎన్నికల నిర్వహణపై జిల్లా యంత్రాంగం సంసిద్ధతపై విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్‌

నిర్వహణకు యంత్రాంగం సిద్ధం

3411 పోలింగ్‌ స్టేషన్లు, 20 వేల మంది సిబ్బంది

విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఏప్రిల్‌ 11వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసిన మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకూ 30, 57, 922 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 15,08,403 మంది మహిళలు 15,49,155 మంది ఇతరులు 364 మంది ఉన్నారని వివరించారు. కాగా ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్‌ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదన్నారు.

ఓటరగా నమోదుకు అర్హత కలిగిన వారంతా ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 3,411 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా 10 శాతం ఈవీఎంలు, వీవీపాట్‌లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 20 వేల మందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనకై 334 బృందాలను నియమించామని చెప్పారు. అలాగే 334 సెక్టార్‌ అధికారులు, 55 మీడియా సర్వైలెన్స్‌ బృందాలు, 15 వీడియో పరిశీలన బృందాలు, 15 అక్కౌంట్‌ బృందాలు, 55 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, మరో 55 స్టాటిక్స్‌ సర్వైలైన్స్‌ బృందాలను నియమించామని వివరించారు. కాగా జిల్లాలో 1057 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటి వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగే వివి«ధ విషయాలను సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అలాగే1950 టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని వివరించారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1700 ఓట్లను తొలగించామని తెలిపారు.   జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు