గుంజాల గోండు లిపి అభివృద్ధికి కృషి

28 Jan, 2014 02:39 IST|Sakshi

 నార్నూర్, న్యూస్‌లైన్ :
 గుంజాల గోండు భాష లిపి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. సోమవా రం మండలంలోని గుంజాల గ్రామం లో గుంజాల గోండు భాష లిపి దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఐటీడీఏ పీవో జనార్దన్‌నివాస్‌తో కలిసి గుంజాల గోండు భాష లిపితో తయారు చేసిన మొదటి వాచకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పరిశోధన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. లిపి ప్రతులను దాచిన  పెద్దలను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా
 ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాల నుంచి వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత ఈ తరం యువతతోపాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శతాబ్దం నాటి గోండు భాషతో కూడిన లిపి ప్రతులను దాచి ఉంచడం సంతోషంగా ఉందన్నారు. గుంజాల గోండు లిపి సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం నుంచి వచ్చిందన్నారు. గుంజాల గోండు భాష లిపి అభివృద్ధి కోసం రూ.15 లక్షలతో రీసర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్‌లో లిపిలో బోధించడానికి  కో-ఆర్డినేటర్‌గా వినాయక్‌రావ్‌ను నియమిస్తున్నామని ప్రకటించారు.
 
 గోండు భాష లిపి అభివృద్ధి కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నం చేస్తానన్నారు. అనంతరం గుంజాల గోండు భాష లిపి వెలికి తీసి తెలుగులో అనువాదం చేసిన ప్రొఫెసర్ జయదీర్ తిరుమల్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎన్నో భాషలకు లిపి ఉన్నా ఈ లిపికి ద్రావిడ భాషకు సంబంధం ఉందన్నారు. లిపితో కూడిన సాఫ్ట్‌వేర్‌ను సెంటర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీధర్‌బాబు తయారు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఈ దినోత్సవం నాటికి గోండు భాషలో కథలు, వాచక పుస్తకాలు తయారు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లిపి రూపకర్తలు కొట్నాక్ జంగు, కుర్ర విఠల్‌రావ్, ఆరక జైవంతరావ్, కుర్ర లాల్‌షావ్, ఆత్రం కమలాబాయి, నాయకులు ఆర్జు, సీడం భీమ్, మెస్రం దుర్గు, కొవ లక్ష్మి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్, సర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు