ఎవరు.. డేటా చోరులెవరు?

3 May, 2019 08:54 IST|Sakshi

కలెక్టరేట్‌ నుంచి పోస్టల్‌ ఓట్ల వివరాలు

సబ్బంకు అందించిందెవరు?

టీడీపీ ప్రజాప్రతినిధి బంధువుపైనే అనుమానాలు

తహసీల్దార్‌గా చేసినప్పుడు భూ దందాల్లోనూ మార్మోగిన ఆయన పేరు

ఎన్నికలకు ముందు కలెక్టరేట్‌లో మకాం

మరో సెక్షన్‌ అధికారిపైనా ఆరోపణలు

భీమిలి తహసీల్దార్‌ఆఫీసుపైనా సందేహాలు

సమగ్ర విచారణ జరుపుతాం.. కలెక్టర్‌ కాటంనేని

పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు తెరపైకి వచ్చిన డేటా చౌర్యం వివాదం పెద్ద కలకలమే రేపింది.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ–గవర్నెన్స్, ఈ–ప్రగతి వ్యవస్థల ద్వారా టీడీపీ నేతలకు చెందిన ఐటీగ్రిడ్, టీడీపీకే చెందిన సేవామిత్ర యాప్‌లలోకి ఓటర్ల కలర్‌ ఫొటోలతో కూడిన ఒరిజినల్‌ జాబితాలను, ఆధార్‌ వివరాలను కూడా చౌర్యం చేశారనీ.. తద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.. దీనిపై కేసులు కూడా విచారణలో ఉన్నాయి..ఇప్పుడు విశాఖలోనూ అటువంటి డేటా చౌర్యమే కలకలం రేపుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగానికి కౌంటింగ్‌ వరకు అవకాశమున్న నేపథ్యంలో ఆ ఓట్లు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెందిన జాబితాలు, ఫోన్‌ నెంబర్లు భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి చేతిలోకి వెళ్లడం.. వాటి ఆధారంగా ఆయనగారు ఉద్యోగులతో సామూహిక టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ.. ప్రలోభాలకు గురి చేస్తుండటంపై ‘సాక్షి’ ఆడియో వివరాలతో సహా రట్టు చేయడం కలెక్టరేట్‌ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. గోప్యంగా ఉంచాల్సిన ఈ జాబితాను చౌర్యం చేసి.. టీడీపీ అభ్యర్థికి అప్పగించిన చోరులెవరన్నది ఇప్పుడుచర్చనీయాంశమైంది.కలెక్టరేట్‌లో తిష్ట వేసిన టీడీపీకి సన్నిహితుడైన ఓ వివాదాస్పద అధికారి ద్వారా సదరు డేటా గడప దాటిందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా..
ఈ వ్యవహారంపై విచారణ కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకునే ప్రభుత్వోద్యోగుల పేర్లు, ఫోన్‌ నెంబర్లతో సహా బయటకు వచ్చిన వ్యవహారం కలెక్టరేట్‌ వర్గాల్లో కలకలం రేపుతోంది. పోస్టల్‌ ఓట్లు కలిగిన ఉద్యోగుల జాబితాను బయటకు ఇవ్వకూడదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు చెప్పుకొచ్చిన జిల్లా అధికారులు ఉద్యోగుల ఫోన్‌ నెంబర్లను సైతం భీమిలి టీడీపీ అభ్యర్థి సబ్బం హరికి అందించిన నిర్వాకం వివాదాస్పదమవుతోంది. ఆ జాబితాను పట్టుకుని సబ్బం హరి ఒకేసారి 500 మంది ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ప్రలోభాల వల వేస్తున్న వైనాన్ని ‘సబ్బం.. ప్రలోభాల పబ్బం’ శీర్షికతో సాక్షి గురువారం బట్టబయలు చేయడంతో.. ఈ అంశం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చకు తెరలేపింది. వాస్తవానికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ నుంచి టీడీపీ అభ్యర్ధులందరికీ ప్రభుత్వోద్యోగుల జాబితాలు చేరాయనే ప్రచారం ఉంది. కానీ సబ్బం హరికి మాత్రం జిల్లా  రెవెన్యూ వర్గాల నుంచే ఆ జాబితా అందిందనే వాదనలకు బలం చేకూరుతోంది. ఆడియో టేపులు నిశితంగా పరిశీలించి విన్న వారికి ఇదే విషయం స్పష్టమవుతుంది.

ఇది టీడీపీ ప్రజాప్రతినిధి బంధువు పనేనా?
జిల్లా రెవెన్యూ వ్యవహారాల్లో టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి బంధువు కొన్నేళ్లుగా హల్‌చల్‌ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సదరు అధికారి తహసీల్దార్‌గా ఉన్నప్పుడు భూ కుంభకోణాల్లోనూ ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ అధికారి విశాఖ రూరల్‌ తహసీల్దార్‌గా పని  చేసిన కాలంలోనే ఎన్నో భూ రికార్డులు తారుమారయ్యాయి. బదిలీ అయిన తర్వాత కూడా దాదాపు 59 రోజులపాటు డిజిటల్‌ కీ అప్పగించని నిర్వాకం ఆయనది. రెవెన్యూ రికార్డులు, డిజిటల్‌ సిగ్నేచర్‌కు సంబంధించి ఈ కంప్యూటర్‌ కీ ఉంటేనే పని సాధ్యం. కొత్త తహసీల్దార్‌ వచ్చినా 59 రోజులపాటు కీ అప్పగించకపోవడం వెనక చాలా వ్యవహారాలు నడిచాయన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. ఇక పెందుర్తి తహసీల్దార్‌గా చేసిన కాలంలో కూడా భూదందాలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. సదరు అధికారి  ఈ ఐదేళ్లలో విశాఖ పరిసర ప్రాంతాల్లోనే.. అదీ కీలకమైన మండలాల్లోనే తహసీల్దార్‌గా పనిచేశారంటే ఆయన హవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అంతటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న అధికారికి ఎన్నికల సమయంలో కలెక్టరేట్‌లోని ఓ సెక్షన్‌ను అప్పగించారు. ఓటర్ల జాబితా వ్యవహారాలతో ఆ సెక్షన్‌కు నేరుగా సంబంధం లేనప్పటికీ కలెక్టరేట్‌లోనే మకాం వేసిన ఆ అధికారి ఎన్నికల విభాగం(పోస్టల్‌ బ్యాలెట్లు పర్యవేక్షించే) అధికారిపై ఒత్తిడి తెచ్చి జాబితాను తన సామాజికవర్గానికి చెందిన సబ్బం హరికి అందజేశారన్న ఆరోపణలు నేరుగా కలెక్టరేట్‌ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్లు పర్యవేక్షిస్తున్న విభాగాధికారిపై కూడా ఇప్పటికే ఎన్నో ఆరోపణలున్నాయి. ఆ అధికారి గత ఏడేళ్లుగా కలెక్టరేట్‌లోనే తిష్ట వేసిన నేపథ్యంతో పాటు టీడీపీ నేతలకు కొమ్ముకాస్తారనే  ఆరోపణలు ఉన్నాయి.

భీమిలి తహసీల్దార్‌ ఆఫీసు నుంచి కూడా...సమగ్ర విచారణ
పోస్టల్‌ ఉద్యోగుల ఓట్ల జాబితా బయటకు రావడంపై సమగ్ర విచారణకు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. గురువారం సాక్షిలో కథనం వచ్చిన దరిమిలా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఉద్యోగుల జాబితా ఫోన్‌ నెంబర్లతో సహా బయట పెట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం.. ఈ తప్పుడు పని ఎవరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యవహారానికి సంబంధించి శుక్రవారం సాయంత్రంలోగా నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించానని కలెక్టర్‌ సాక్షి ప్రతినిధితో  చెప్పారు.

మరిన్ని వార్తలు