సీఎం పర్యటనపై కలెక్టర్‌ సమీక్ష

22 Nov, 2017 08:14 IST|Sakshi

కాకినాడ రూరల్‌: డిసెంబర్‌ 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ ప్రారంభ రోజున ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ కార్తికేయమిశ్రా, ఎస్పీ విశాల్‌గున్ని, జేసీ ఎ.మల్లికార్జునలతో పాటు జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు కాకినాడ నగరం, బీచ్‌ ఫెస్టివల్‌ ప్రాంతాల్లో చేయవలసిన ఏర్పాట్లను కలెక్టర్‌ చర్చించారు. పర్యటనలో నగరంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు, సీఎం పర్యటన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌కు ఈసారి అధిక సంఖ్యలో ప్రజలు, పర్యాటకులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, గతంలో జరిగిన బీచ్‌ ఫెస్టివల్స్‌ అనుభవం దృష్టిలో పెట్టుకొని, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్‌ ప్రాంతానికి సామాన్య ప్రజలు ఇబ్బంది లేకుండా చేరుకోవడం, వీఐపీలు కూడా సభాస్థలికి సులువుగా చేరేందుకు చేపట్టవలసిన చర్యల్లో భాగంగా అందుబాటులో ఉన్న బ్రిడ్జిలతో పాటు అవసరమైన తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటుపై కూడా చర్చించారు. 

బీచ్‌ ఫెస్టివల్‌కు వచ్చే ప్రజలకు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి బీచ్‌కు చేరే విధంగా రవాణా ఏర్పాటుతో పాటు బీచ్‌ సమీపంలో ఉన్న ఓఎన్‌జీసీ స్థలంలో పార్కింగ్‌ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం పర్యటన, బీచ్‌ ఫెస్టివల్‌ కోసం పక్కా ట్రాఫిక్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలకు ట్రాఫిక్‌ తదితర విషయాలపై మార్గనిర్దేశం చేయాలన్నారు. సీఎం పర్యటించే నగరంలోని ప్రాంతాల్లో శానిటేషన్‌ పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ శివపార్వతికి కలెక్టర్‌ కార్తికేయమిశ్రా సూచించారు. ట్రైనీ కలెక్టర్‌ ఆనంద్, డీఎస్పీ వర్మ, ట్రాఫిక్‌ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు