లోగుట్టు ఏమిటో?!

14 Mar, 2018 11:45 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ

పెద్దాసుపత్రిలో రహస్య సమావేశం

ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధుల పంపకానికి చర్చ!

మీడియాను అనుమతించని అధికారులు

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కమిటీ సమావేశాలకు ప్రజాప్రతినిధులతో పాటు మీడియాను కూడా అనుమతిస్తారు. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు మాత్రం మీడియాను అడ్డుకుంటున్నారు. మంగళవారం సైతం ఇలాగే మీడియా ప్రతినిధులను సమావేశం నుంచి పంపించివేశారు. ఆసుపత్రి నిధుల వినియోగంపై జరిగే చర్చల్లో విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీడియాను అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వజన వైద్యశాలలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే.. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆలస్యంగా రావడంతో రాత్రి 7.15 గంటలకు సమావేశం ప్రారంభమై.. 9 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5  నుంచి అక్కడే ఉన్న విలేకరులను సమావేశం ప్రారంభమయ్యాక అధికారులు బయటకు పంపించారు. ఇదేమంటే సమావేశమయ్యాక బ్రీఫింగ్‌ ఇస్తామని, మీడియా అవసరం లేదని చెప్పారు.  ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధులు రూ.15 కోట్లకు పైగా ఆసుపత్రిలో ఉన్నాయి. వీటిని ఖర్చు చేసేందుకే అధికారులు ఉన్న ఫలంగా సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత  సమావేశంలో తీర్మానించిన పనులు పూర్తి కాకుండానే మళ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి అధికారులతో పాటు కమిటీ సభ్యులు  పాల్గొని నిధుల వినియోగంపై చర్చించారు. ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. 

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం
ఆసుపత్రిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ఇంజినీరింగ్‌ అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పందులు విచ్ఛలవిడిగా తిరుగుతున్నాయని, ఆసుపత్రి అధికారులతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ ఏం చేస్తున్నారని ఆయన మందలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వారిపై ఎవ్వరి అజమాయిషీ లేనట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. తాను ఆకస్మిక తనిఖీకి వస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.ఆసుపత్రిలో రూ.11.56 కోట్లతో డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌కు రెండోసారి టెండర్‌కు వెళ్తున్నామన్నారు. అంతర్గత రహదారుల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న అధికారుల క్వార్టర్లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో రెండు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, గ్యాస్ట్రో విభాగం అభివృద్ధికి రూ.8లక్షలు, పీడియాట్రిక్‌ బ్లాక్‌లో రూ.7లక్షలతో బ్రాంకోస్కోపి, రెండు వెంటిలేటర్లు, రూ.17లక్షలతో ఫుల్లీ ఆటోఅనలైజర్‌ కొనుగోలు చేస్తామన్నారు.

ఆసుపత్రికి అవసరమైన పరికరాలను రూ.4.73 కోట్లతో కొనుగోలు చేస్తామని తెలిపారు. డిజిటల్‌ రేడియోగ్రాఫిక్‌ పరికరానికి రూ.1.33 కోట్లు వెచ్చిస్తున్నామని,  ఈ యంత్రం ఒకేసారి 400 ఎక్స్‌రే ప్రింట్లు తీస్తుందని తెలిపారు. ఈసీటీ(మానసిక వ్యాధులలో షాక్‌ ట్రీట్‌మెంట్‌)కి రూ.6లక్షలు, సెల్‌కౌంటర్‌కు రూ.6లక్షలు, మూడు బోర్లు, 320 కేవీ జనరేటర్‌కు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 3 సులభ్‌ కాంప్లెక్స్‌లకు అనుమతులు ఇస్తున్నామని, ఎన్‌టీఆర్‌ వైద్యసేవ నిధులతో 41 మందిని(3 ఫార్మాసిస్టు, 5 ఈసీజీ, 1 ఈఈజీ, 1 ఈఆర్‌సీపీ, 5 హెల్పర్లు, 10 డేటాఎంట్రీ ఆపరేటర్లు, 15 స్టెచ్చర్‌ బాయ్స్, 1 బార్బర్‌) ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమిస్తామని వెల్లడించారు. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కింద 11 మంది ఉద్యోగుల వేతనాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీఎస్‌ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్, కమిటీ సభ్యులు  మంజునాథరెడ్డి, అనురాధ, మహేష్‌గౌడ్, పోతురాజు రవికుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్, మున్సిపల్‌ కమిషనర్‌ హరినాథరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు