ప్ర‘హరీ’పై కలెక్టర్‌ సీరియస్‌

12 Aug, 2019 06:59 IST|Sakshi

కాంట్రాక్టర్‌పై కేసు నమోదుకు రంగం సిద్ధం 

జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పనులపై విచారణకు ఆదేశం

సాక్షి, అనంతపురం: ధర్మవరం మండలం దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ గాలికి కూలిపోయిన ఘటనపై కలెక్టర్‌ సత్యనారాయణ సీరియస్‌ అయ్యారు. రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గాలికి కూలిపోవడంపై వెంటనే పూర్తిస్థాయిలో విచారించి సదరు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంట్రాక్టర్లు హడావుడిగా చేసిన పనులన్నింటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

20 రోజుల్లో నిర్మాణం పూర్తి 
దర్శనమల ఉన్నత పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి సమీప బంధువు నారాయణప్ప దక్కించుకున్నారు. ఎన్నికల ముందు 20 రోజుల్లోనే పనులు పూర్తి చేయించి టీడీపీ హయాంలోనే బిల్లు డ్రా చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే హడావుడిగా ప్రహరీని నాసిరకంగా నిర్మించారు. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో బిల్లు మంజూరు కాలేదు. ఇటీవల వీచిన మోస్తరు గాలికే ప్రహరీ కూలిపోయింది. ఘటనపై ఈనెల 9న ‘ప్ర’హరీ’ శీర్షికతో ‘సాక్షి’లో వార్తా కథనం ప్రచురితమైంది. స్పందించిన కలెక్టర్‌ సత్యనారాయణ ఎస్‌ఎస్‌ఏ పీఓ రామచంద్రారెడ్డి, డీఈలతో మాట్లాడారు. పని ఎవరు చేశారు.. ఎలా చేశారు.. నాసిరకంగా నిర్మిస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే పూర్తిస్థాయిలో విచారణ చేయడంతో పాటు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌తో ఫిర్యాదు ఇప్పించి కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయిస్తామని ఎస్‌ఎస్‌ఏ అధికారులు తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా ప్రహరీ నిర్మాణాలపై విచారణ 
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చాలాచోట్ల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. 15–20 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసి బిల్లులు పెట్టేశారు. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో అధికారులు కూడా నోరు మెదపకుండా కొందరికి బిల్లులు కూడా ఇచ్చేశారు. మరికొందరి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటిపై విచారణ చేయించేలా కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయా పనుల్లో నాణ్యత ఏ మేరకు ఉందో పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో కాంట్రాక్టర్లలో వణుకు మొదలైంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా