తనిఖీలతో హడలెత్తించిన కలెక్టర్

20 Jan, 2014 04:14 IST|Sakshi

నిర్మల్ అర్బన్, న్యూస్‌లైన్ : కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదివారం నిర్మల్ లో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. నిర్మ ల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఇక్కడికి వచ్చారు. ఆర్డీవో భవన నిర్మాణ పను లు, నిర్మల్‌లోని బస్టాండ్ సమీపంలో రూ.8 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రి భవనాన్ని పరిశీలించారు. ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించినా వినియోగంలోకి తీసుకు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

భవనంలోని గదులు పరిశీలించారు. నిర్మాణానికి వెచ్చించిన నిధులు, భవనంలో రోగులకు కల్పించే మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. భవనం ఎందుకు వృథాగా ఉంచారని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ధూంసింగ్‌ను ప్రశ్నించారు. సరైన రోడ్డు సౌకర్యం లేదని, పూర్తి స్థాయిలో పనులు కాలేదని సమాధానమిచ్చారు. చిన్న కారణాలతో భవనాన్ని నిరుపయోగంగా ఉంచడం సరికాదని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైన వసతులు కల్పిస్తానని చెప్పారు.

ఆర్డీవో కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. నిధుల కొరత కారణంగా ఆలస్యమవుతోందని సంబంధిత కాంట్రాక్టర్ చెప్పడంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో జల్ద అరుణశ్రీ, తహసీల్దార్ అజ్మీరా శంకర్‌నాయక్, ఆర్‌ఐ షబ్బీర్ అహ్మద్ ఉన్నారు.

మరిన్ని వార్తలు