అక్రమార్కుల మెడకు బిగుస్తున్నఉచ్చు! 

10 Sep, 2019 11:23 IST|Sakshi

సాక్షి, కర్నూలు : వ్యవసాయశాఖలో చోటు చేసుకున్న రూ.97.55 లక్షల కుంభకోణంలో అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగుస్తోంది.  కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షం గా సంబంధం ఉన్న ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, ఇటీవల పదవీ విరమణ చేసిన జేడీఏ ఠాగూర్‌నాయక్, ప్రస్తుతం నంద్యాల రైతు శిక్షణ కేంద్రంలో ఏడీఏగా ఉన్న గిరీష్, జేడీఏ కార్యాలయంలో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం సీటు నిర్వహిస్తున్న ఏవో అశోక్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. ఈ కుంభకోణంపై అప్పటి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అప్పటి జేసీ–2 మణిమాలతో సహా నలుగురు సభ్యుల కమిటీని వేశారు. ఈ కమిటీ ప్రస్తుత కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన కలెక్టర్‌ వీరపాండియన్‌.. కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌పై క్రిమినల్‌ కేసు పెట్టాలని ఆదేశిస్తూ మిగిలిన నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తొలుత రూ.28.65 లక్షలు దారి మళ్లినట్లు తేలింది. దీనిపై అప్పటి జేడీఏ ఠాగూర్‌నాయక్‌ త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజేష్‌ను అరెస్ట్‌ చేసి.. రూ.3.50 లక్షలు రికవరీ చేశారు. తర్వాత ఫోర్‌మెన్‌ కమిటీ విచారణలో జాతీయ ఆహార భద్రత పథకం నిధులు మొత్తంగా  రూ.97.55 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. ప్రధాన సూత్రధారి రాజేష్‌పై మరోసారి క్రిమినల్‌ కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత జేడీఏ విల్సన్‌ దీనిపై రెండు, మూడు రోజుల్లో  ఫిర్యాదు చేయనున్నారు. విశ్రాంత జేడీఏ ఠాగూర్‌నాయక్, ఆత్మపీడీ ఉమామహేశ్వరమ్మ, నంద్యాల ఎఫ్‌టీసీ ఏడీఏ గిరీష్, ఏవో అశోక్‌కుమార్‌రెడ్డిలపై వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ చర్యలు తీసుకోనున్నారు. కుంభకోణంలో విశ్రాంత జేడీఏకు కూడా సంబంధం ఉండటం వల్ల ఆయనకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కుంభకోణాన్ని  వ్యవసాయ శాఖ కమిషనర్‌ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఒక్క జూనియర్‌ అసిస్టెంటు ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడటం సాధ్యమేనా అనే అనుమానాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు