భీమిలి ఉత్సవాలకు వడివడిగా ఏర్పాట్లు

28 Oct, 2019 19:06 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ కలెక్టరేట్‌లో ఈ నెల 9న జరిగే భీమిలి ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి వివిధ శాఖల మధ్య సమన్వయ ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ వినయ్‌చంద్‌ వెల్లడించారు.

సమస్యల పరిష్కారంలో విశాఖ నెం.1
జిల్లాలో నిర్వహించే స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో విశాఖ రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని కలెక్టర్ వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతుల్లో ప్రస్తుతం 90 శాతం సమస్యలను అధికార యంత్రాంగం పరిష్కరించిందని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. అదేవిధంగా నీటి పారుదల శాఖ నిర్మాణాలు, గ్రామీణ నీటి సరఫరా ట్యాంకులు బలహీన పడినట్లుగా జిల్లా అధికారులు గుర్తించారని చెప్పారు. సమస్యలపై అధికారులతో పరిశీలించి త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. 

మరిన్ని వార్తలు