వైద్య ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం

7 Jun, 2014 02:21 IST|Sakshi
వైద్య ఉద్యోగులపై కలెక్టర్ ఆగ్రహం

 పనితీరు మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
 
 రిమ్స్‌క్యాంపస్, న్యూస్‌లైన్: వైద్యాధికారులు, వైద్యశాఖ ఉద్యోగుల పనితీరుపై కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పురాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌వో కార్యాలయ సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఎస్‌పీహెచ్‌వోలతో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సిన వైద్య ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఎంతమాత్రం సరికాదన్నారు. దోనుబాయి పీహెచ్‌సీని ఇటీవల అకస్మికంగా తనిఖీ చేయగా..ఆ సమయంలో తాళాలు వేసి ఉందన్నారు.  24 గంటలు తెరచి ఉండాల్సిన పీహెచ్‌సీకి తాళాలు వేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
 
మరికొన్ని పీహెచ్‌సీలను తనిఖీ చేయగా వైద్యులు, సిబ్బంది సరిగ్గా ఉండకపోవటం వంటి సమస్యలను గుర్తించానన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాల్సిన వారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని నిలదీశారు. చాలామంది ఉద్యోగులు బాధ్యతరహితంగా పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలోని గుమస్తాలను పిలిచి ఎవరెవరు ఏ విధులు నిర్వహిస్తున్నారో కలెక్టర్ ఆరా తీశారు. అయితే కొంతమంది తడబడటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలో  తానే నిర్ణయించి జాబ్ షీట్ వేస్తానని చెప్పారు.
 
‘మార్పు’ కార్యక్రమం బాగా నిర్వహించినందుకు జిల్లాకు రాష్ట్రంలో ద్వితీయ స్థానం దక్కిందన్నారు. ఇందుకు సీతంపేట, నరసన్నపేట పీహెచ్‌సీల సిబ్బంది బాగా సహకరించారని ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులను కలెక్టర్ అభినందించారు. అనంతరం ఎన్.ఆర్.హెచ్.ఎం వివరాలను పొందుపరిచేందుకు గాను కొత్తగా వచ్చిన ల్యాప్‌టాప్‌లను పీహెచ్‌సీల వైద్యాధికారులకు పంపిణీ చేశారు.
 
 కాగా సమావేశానికి వస్తున్నప్పడు కార్యాలయంలోని లిఫ్ట్ పని చేయకపోవటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు.  రూ. 25 వేలు ఖర్చు పెట్టి లిఫ్ట్ బాగు చేసుకోకపోతే ఎలా అంటూ వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అలాగే కార్యాలయంలో బూజు పట్టి ఉండటం చూసి ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఉంటున్న కార్యాలయం ఇలా ఉండటం సరికాదని కలెక్టర్ వ్యాఖ్యానించారు. సమావేశంలో ఏజేసీ మహ్మద్ షరీఫ్, డీఎంహెచ్‌వో ఆర్.గీతాంజలి, ఏవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు