ఎవరినీ వదలొద్దు..

31 Mar, 2020 13:24 IST|Sakshi
సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ప్రత్యేకాధికారి, ఎస్పీ తదితరులు

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువ

ప్రతి కుటుంబాన్ని వలంటీర్లతో పరిశీలన చేయించండి   

జిల్లా అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

తూర్పుగోదావరి, ,కాకినాడ సిటీ: నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వలంటీర్లు పరిశీలన చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీమ్స్‌ బాగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత ఉందన్నారు. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు వివరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో మాట్లాడుతూ యువ అధికారుల నుంచి ప్రభుత్వం మరింత సేవలను ఆశిస్తుందన్నారు. దానికి అనుగుణంగా పని చేయాలన్నారు.

కోవిడ్‌–19 కేసుల కోసం జిల్లాలో కిమ్స్‌ ఆసుపత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 730 నుంచి 800లకు, ఐసీయూ బెడ్‌లు 52 నుంచి 70కి పెంచుతున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, జేసీ–2 రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి బి రాజశేఖర్‌ విద్యాశాఖాధికారులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించి నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన పనులను పూర్తి చేసేలా చూడాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌ 24 వరకు కావల్సిన రేషన్‌ ఉంచి, మిగతా వాటిని జిల్లా యంత్రాంగానికి ఇచ్చేయాలని ఆదేశించారు. రైతు బజారుల్లో వ్యాయామ ఉపాధ్యాయులను కరోనా నియంత్రణలో భాగంగా వారి సేవలను వినియోగించాలన్నారు.

కలెక్టరేట్‌లో టెలీహబ్‌ ఏర్పాటు
కాకినాడ సిటీ: స్థానిక కలెక్టరేట్‌లోని అబ్జర్వేషన్‌ సెంటర్‌లో టెలీహబ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి సోమవారం తెలిపారు. ఆరుగురు వైద్యులతో ఈ హబ్‌ 24 గంటలు పని చే స్తుందన్నారు. జలుబు, దగ్గుతో బాధపడే వారు ఏ సమయంలోనైనా ఫోన్‌ ద్వారా ఈ వైద్యుల సలహాల కోసం 0886 2333466, 0884 2333488 నంబర్లను సంప్రదించాలనిఆయన సూచించారు. 

కోవిడ్‌–19 కాల్‌ సెంటర్‌
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌–19 కాల్‌ సెంటర్‌కు వ్యక్తిగతంగా ఎవరినీ అనుమతించమని కలెక్టర్‌ తెలిపారు. వైద్య, రవాణా, పౌర సరఫరాలు, పోలీస్‌ తదితర అత్యవసర సమస్యలున్న వారు కంట్రోల్‌ రూమ్‌లోని కాల్‌ సెంటర్లను 1800 425 3077, 0884 2356196, 93923 24287కు ఫోన్‌ చేసి సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు