సంస్థానాల విలీనం ‘ఉక్కు’ సంకల్పం

1 Nov, 2014 03:50 IST|Sakshi
 • రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
 • ఘనంగా పటేల్ జయంతి భారీ ర్యాలీ
 • పాల్గొన్న విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు
 • కోనేరుసెంటర్(మచిలీపట్నం) : స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 554 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించడంలో  ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ప్రధాన పాత్ర పోషించారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత గట్టాలను విద్యార్థులంతా తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. సర్ధార్ వల్లభాయ్‌పటేల్ జయంతిని శుక్రవారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో భారీ ర్యాలీ జరిగింది.

  ర్యాలీలో  బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణరావు,  కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జి.విజయ్‌కుమార్, ఏజేసీ బిఎల్.చెన్నకేశవులు, డీఆర్‌వో ప్రభావతి, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక లక్ష్మీటాకీస్‌సెంటర్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వల్లభాయ్‌పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  మంత్రి రవీంద్ర ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

  మంత్రి రవీంద్ర మాట్లాడుతూ  పటేల్ జయంతిని ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రీయ ఏక్‌తా దివస్‌గా పాటించాలని నిర్ణయించడం ప్రశంసనీయమన్నారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ పటేల్ ఆనాటి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో హోంమంత్రిగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన కారణంగా నేడు భారతదేశం శాంతిసామరస్యాలతో విరాజిల్లుతుందని చెప్పారు.   

  జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ  మన రాష్ట్రంలో నిజాం ప్రభుత్వ ఆగడాలను అరికట్టి సైన్యాన్ని దింపి సంస్థానాలకు విలీనం చేయడంలో పటేల్ చేసిన సాహసం మాటలతో కొనియాడలేనిదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో పి.సాయిబాబు అధ్యక్షతన జరిగిన   కార్యక్రమంలో బందరు డీఎస్పీ డాక్టర్ కెవి.శ్రీనివాసరావు, తహశీల్ధార్ బి.నారదముని, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, పట్టణంలోని వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 4,000మంది విద్యార్థులు పాల్గొన్నారు.
   
  విజయవాడలో రన్ ఫర్ యూనిటీ....

  విజయవాడ : దేశ ఐక్యతా దిశగా కృషి చేసిన వ్యక్తిగా దేశ ప్రథమ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ వద్ద  ఈ పరుగును డాక్టర్ కామినేని శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించగా,  మూడు వేల మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు.  

  రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరావు, నగర మేయర్ కోనేరు శ్రీధర్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి,  ప్రముఖులు తుర్లపాటి కుటుంబరావు, ఎంసీదాస్, డీఎస్‌డీవో రామకృష్ణతో పాటు, నలందా, బిషప్ అజరయ్య, మాంటిస్సోరి, నిర్మలా కాన్వెంట్, గౌతమ్ డిగ్రీ కళాశాలల  విద్యార్ధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు