రంగుల కల సాకారం

11 Mar, 2015 06:56 IST|Sakshi

విశాఖపట్నం: జిల్లాలో ఏషియన్ పెయింట్స్ కర్మాగారం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. జిల్లాలో 110 ఎకరాల్లో రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఆ సంస్థ తమ యూనిట్‌ను స్థాపించనుంది. ఇందుకోసం ఏషియన్ పెయింట్స్ సంస్థకు అచ్యుతాపురం మండలం పూడి సమీపంలో 110 ఎకరాలు కేటాయించేందుకు  ఏపీఐఐసీ ముందుకొచ్చింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం  ఆమోదించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఏషియన్ పెయింట్స్ సంస్థ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. దాంతో కొంతకాలంగా ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రణాళిక అమలుకు రంగం సిద్ధమైంది.



అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ 2 విస్తరణలో భాగంగా పూడి గ్రామంలో కొంతభాగాన్ని ఏపీఐఐసీ నాన్ ఎస్‌ఈజెడ్‌గా అభివృద్ధి చేస్తోంది. అందులో 110 ఎకరాలను కాంటినెంటల్ కార్బన్ అనే సంస్థకు గతంలో కేటాయించారు. కానీ ఆ సంస్థ చివరి నిముషంలో వెనక్కి వెళ్లిపోయింది. దాంతో ఆ 110 ఎకరాలను ఏషియన్ పెయింట్స్ సంస్థకు కేటాయించేందుకు ఏపీఐఐసీ గత ఏడాది డిసెంబర్‌లో ప్రతిపాదించింది. డిసెంబర్లోనే ఆ సంస్థ ప్రతినిధులు పూడి గ్రామంలో పర్యటించిన అన్ని అంశాలను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనకు ఏపీఐఐసీ సమ్మతించడంతో అక్కడ ప్లాంటు నెలకొల్పాలని నిర్ణయించారు.


రూ. 1,750కోట్ల పెట్టుబడితో...
పూడిలో ప్లాంట్ కోసం రూ.1,750కోట్ల పెట్టుబడి పెట్టాలని ఏషియన్ పెయింట్స్ సంస్థ భావిస్తోంది. రోజుకు 4వేల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును నెలకొల్పాలన్నది ఆ సంస్థ ప్రణాళిక. దీనివల్ల ప్రత్యక్షంగా 300మందికి, పరోక్షంగా 500మందికి ఉపాధి లభిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భూమిని తమకు స్వాధీనం చేసిన ఏడాదిలోగా ప్లాంటు నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ యోచనగా ఉంది.

>
మరిన్ని వార్తలు