సామాజిక స్పృహతో రండి

20 Dec, 2014 01:00 IST|Sakshi
సామాజిక స్పృహతో రండి
  • డీఎస్‌ఎన్‌ఎల్‌యూ స్నాతకోత్సవంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ఉద్బోధ
  • పవిత్రమైన న్యాయవాద వృత్తిని వ్యాపారాత్మకం చేయొద్దు
  • డబ్బు సంపాదించాలనుకుంటే వ్యాపారాలు చేసుకోండి
  • ఉద్దేశపూర్వకంగా ఏ చిన్న పొరపాటు చేసినా వృత్తికి మచ్చ తెచ్చిన వారవుతారు
  • న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి
  • సాక్షి, విశాఖపట్నం: ‘‘ధనకాంక్షతో న్యాయవాద వృత్తిలోకి రావద్దు. సామాజిక స్పృహతో రండి’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు న్యాయ విద్యార్థులకు ఉద్బోధిం చారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ) తొలి స్నాతకోత్సవం శుక్రవారం విశాఖపట్నం లో జరిగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్ హెచ్.ఎల్.దత్తు స్నాతకోపన్యాసం చేశారు.

    ‘‘డబ్బు సంపాదించే ఉద్దేశంతో  కొందరు ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు. అలాంటి ఉద్దేశం ఉంటే తక్షణం మార్చుకోండి. డబ్బు కోసమైతే ఇతర వృత్తులు, వ్యాపారం చేసుకోవచ్చు. పవిత్రమైన న్యాయ వ్యవస్థను వ్యాపారాత్మకం చేయొద్దు. న్యాయవాదుల చేతుల్లోనే భారత భవిష్యత్తు ఆధారపడి ఉంది. న్యాయవ్యవస్థ గొప్పదనాన్ని గుర్తించి సామాజిక స్పృహతో అందరికీ సమానంగా న్యాయసహాయం చేయాలి’’ అని జస్టిస్ దత్తు చెప్పారు. ‘‘మహా భారతంలోని మూల సిద్ధాంతమైన ధర్మసూత్రాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఆచరిస్తోంది. ఎవరికి వారు ధర్మాన్ని ఆచరిస్తే న్యాయ పరిరక్షణ సాధ్యమవుతుంది’’ అని చెప్పారు.

    ‘‘నేను ఏడో తరగతిలోకి అడుగు పెట్టినప్పుడు రంగనాధరావు అనే  ప్రధానోపాధ్యాయుడు మా తరగతి గదిలోకి వచ్చి బోర్డుపై ‘3హెచ్ స్క్వేర్’ అని రాశారు. ఎవరైనా పాఠాలు బోధించే ముందు ఓం అనో, శ్రీ అనో రాస్తారు. కానీ ఆయన ఎందుకిలా రాశారో మాకు అర్థం కాలేదు. అప్పుడాయన చెప్పిన ఫార్ములా ఇప్పటికీ గుర్తుంది. తొలి హెచ్ - హార్డ్‌వర్క్ (శ్రమ), రెండో హెచ్ - హంబుల్‌నెస్ అండ్ హ్యుమానిటీ (అణకువ, మానవత్వం), మూడో హెచ్ - హానెస్టీ (నిజాయితీ).. అని వివరించారు. ఇవి అలవరుచుకుంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెప్పారు.

    ఆ విషయాలను నేను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్లాను. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు మీ ముందు ఈ స్థాయిలో నిలబడ్డాను. జీవితంలో పైకి రావాలంటే ఎలాంటి అడ్డదారులూ లేవు. తపన, సంకల్పం, క్రమశిక్షణ ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చు. అంకితభావం, కష్టపడి పనిచేసే తత్వం అలవర్చుకోవాలి. వీటికి ప్రత్యామ్నాయం లేవు. మార్కులు, ఫలితాలు, ర్యాంకులను పరిగణనలోకి తీసుకోకుండా ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతిలో విజయాలు వరిస్తాయి.

    ఫస్టా.. లాస్టా అన్నది కాదు.. జీవి తంలో పోరాడటం ముఖ్యం. డిగ్రీలు గుర్తింపు మాత్రమే. మనకు నచ్చిన వృత్తిని ఎంచుకునేందుకు మార్గాలు చూపిస్తాయి.  రాణించడమనేది అంకితభావం, కృషి పైనే ఆధారపడి ఉం టుంది. చదువు ముగించుకున్న మీకు జీవితం ఇప్పుడే మొదలైంది. సవాళ్లను ఎదుర్కొనే సమయమిది. వాటిని అధిగమిస్తూ జీవితాన్ని అర్ధవంతం చేసుకోవాలి. చట్ట ప్రకారం న్యాయం పొందడం రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములమైన మనంప్రజలకు జవాబుదారులుగా ఉండాలి’’ అని వివరించారు.
     
    అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతా: సీఎం

    న్యాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేందుకు అన్ని సహాయ సహకారాలు అందిస్తానని సీఎం చంద్రబాబునా చెప్పారు. యూనివర్సిటీకి అవసరమైన 50 ఎకరాలు ఇస్తామని, భవన నిర్మాణాలకు తక్షణమే రూ.25 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. వీసీ ప్రొఫెసర్ ఆర్‌జీబీ భగవత్ కుమార్  నివేదికను సమర్పించారు.  ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన 43 మందికి డిగ్రీలు ప్రదా నం చేశారు. ఐదుగురు టాపర్స్‌కు స్వర్ణ పతకాలు బహూకరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య, వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల వీసీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
     

>
మరిన్ని వార్తలు